Sunday, October 5, 2025
E-PAPER
Homeఆటలు141 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ..

141 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ హర్జాస్ సింగ్ చరిత్ర సృష్టించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరూ ఊహించని రీతిలో ట్రిపుల్ సెంచరీ బాది ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. శనివారం సిడ్నీలోని పాటర్న్ పార్క్‌లో వెస్ట్రన్ సబర్బ్స్ తరఫున ఆడిన హర్జాస్.. సిడ్నీ క్రికెట్ క్లబ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 141 బంతుల్లోనే 35 భారీ సిక్సర్ల సాయంతో 314 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

ఆస్ట్రేలియా గ్రేడ్ క్రికెట్ చరిత్రలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా హర్జాస్ నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో, న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ ఫస్ట్-గ్రేడ్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు చేసిన ఫిల్ జాక్వెస్ (321), విక్టర్ ట్రంపర్ (335) వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.

హర్జాస్ సిడ్నీలో జన్మించినప్పటికీ, అతని మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. అతని తల్లిదండ్రులు 2000 సంవత్సరంలో ఛండీగఢ్ నుంచి సిడ్నీకి వలస వెళ్లారు. 2024 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌పై 55 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించడం ద్వారా హర్జాస్ అప్పట్లోనే వార్తల్లో నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

ఈ రికార్డు ఇన్నింగ్స్‌పై ఫాక్స్ క్రికెట్‌తో హర్జాస్ మాట్లాడుతూ “నా కెరీర్‌లోనే ఇంత క్లీన్‌గా బంతిని బాదడం ఇదే మొదటిసారి. ఆఫ్-సీజన్‌లో నా పవర్-హిట్టింగ్‌పై చాలా కష్టపడ్డాను. ఆ కష్టం ఈరోజు ఫలించినందుకు గర్వంగా ఉంది” అని చెప్పాడు. గతంలో బయటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు కేవలం తన ఆటపైనే దృష్టి సారించానని పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -