Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవీఐపీలకు మూడంచెల భద్రత

వీఐపీలకు మూడంచెల భద్రత

- Advertisement -

గ్లోబల్‌ సమ్మిట్‌కు కట్టుదిట్టమైన సెక్యూరిటీ
వెయ్యి సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా
రెండ్రోజుల పాటు ట్రాఫిక్‌ డైవర్షన్లు
ఉన్నతాధికారులతో ఏర్పాట్లను సమీక్షించిన డీజీపీ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా కందుకూరులో 8,9 తేదీలలో జరిగే తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి తెలిపారు. గ్లోబల్‌ సమ్మిట్‌ సెక్యూరిటీ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు అంతర్జాతీయంగా మూడువేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. దీని ఆధారంగా తెలంగాణను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన పెట్టుబడులను సమీకరిస్తున్నారనీ, ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును కూడా నిర్వహిస్తున్నామని డీజీపీ చెప్పారు. ఈ సమ్మిట్‌కు విచ్చేస్తున్న ఆహ్వానితుల భద్రతకు మూడంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమ్మిట్‌ జరిగే ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారనీ, ఆ పరిసరాలకు ఆహ్వానితులు తప్పించి మూడో వ్యక్తి లోనికి అడుగు పెట్టకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని ఆయన అన్నారు. శాంతి భద్రతల విభాగం పోలీసులతో పాటు గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం, తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (సీఏఆర్‌) విభాగాలకు చెందిన సిబ్బందితో అడుగడుగునా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతేగాక సమ్మిట్‌ ప్రాంగణం మొదలుకొని ఆ పరిసరాల్లో పూర్తిగా అడుగడుగునా కన్నేసి ఉంచడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వివరించారు. ఈ బందోబస్తును సీనియర్‌ పోలీసు అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారని తెలిపారు. సమ్మిట్‌ జరిగే రెండ్రోజులపాటు ఆ పరిసరాల్లో ట్రాఫిక్‌ను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించటం జరుగుతుందని శివధర్‌రెడ్డి వివరించారు. దాదాపు ఏడు వేల మందికి పైగా పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామనీ, శనివారం సాయంత్రం నుంచి ఆ ప్రాంగణాన్ని పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. సమ్మిట్‌ ముగిశాక పదో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఆ ప్రాంగణాన్ని వీక్షించడానికి ప్రజలను అనుమతించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, టీజీఐఐసీ కమిషనర్‌ శశాంక్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజరు కుమార్‌, ఫైర్‌ సర్వీసుల శాఖ డీజీ విక్రమ్‌సింగ్‌ మాన్‌తో పాటు పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -