నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల చైనా వేదికగా జరిగిన షాంఘై సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్, ప్రధాని మోడీల కలయికపై ట్రంప్ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. వారందరూ కలిసి అమెరికాపై కుట్రలు చేస్తున్నారని ఆ ముగ్గురు దేశాధినేతల ఫొటోను జోడించి తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. భారత్, రష్యాలకు దూరమయ్యాం, ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై శనివారం మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు.
రష్యా చమురు కొనుగోలు చేయవద్దని భారత్‌కు తాను చెప్పానని, అయినా వెనక్కి తగ్గకపోవడంతో భారత దిగుమతులపై పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధించానని ట్రంప్ తెలిపారు. అయితే తాను భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు చాలా ఎక్కువేనని ఆయన అంగీకరించారు. ప్రధాని నరేంద్రమోదీతో తనకున్న వ్యక్తిగత సంబంధాల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు.
‘భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారా..?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘కచ్చితంగా’ అని ట్రంప్ బదులిచ్చారు. ‘నేను ఎప్పుడూ అదే కోరుకుంటా. ప్రధాని మోదీతో నేను ఎప్పుడూ స్నేహంగానే ఉంటా. ఆయన గొప్ప ప్రధాని. కానీ.. ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్-అమెరికా దేశాల మధ్య ప్రత్యేకమైన బంధం ఉంది. దీనిపై ఆందోళన అవసరం లేదు’ అని చెప్పారు.
అదే విధంగా ట్రంప్ వ్యాఖ్యలపై పీఎం మోడీ సంతోషం వ్యక్తం చేశారు.ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయమంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.