Friday, October 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయందిగొచ్చిన ట్రంప్‌

దిగొచ్చిన ట్రంప్‌

- Advertisement -

చైనాపై సుంకాలు తగ్గిస్తున్నట్టు ప్రకటన
బుసాన్‌లో జిన్‌పింగ్‌తో భేటీ
పలు అంశాలపై ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం
చైనా నుంచి అమెరికాకు రేర్‌ ఎర్త్‌ ఎగుమతులు
సోయాబీన్‌ కొనేందుకు బీజింగ్‌ అంగీకారం

బుసాన్‌ (దక్షిణ కొరియా) : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార (అపెక్‌) సదస్సుకు హాజరైన ఇరువురు నేతలు తమ ద్వైపాక్షిక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాన్ని ‘అద్భుతమైన విజయం’గా ట్రంప్‌ అభివర్ణించారు. జిన్‌పింగ్‌ ఓ శక్తివంతమైన దేశానికి బ్రహ్మాండమైన నాయకుడని కొనియాడారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చైనాలో పర్యటిస్తానని చెప్పారు.

ఈ సమావేశం సందర్భంగా చైనా నుంచి అమెరికాకు రేర్‌ ఎర్త్స్‌ ఎగుమతులపై ఏడాది కాలానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. అమెరికా నుంచి సోయాబీన్‌ను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించింది. అదే విధంగా ఫెంటానిల్‌ సంబంధమైన సుంకాలను తగ్గించే విషయంపై కూడా అంగీకారం కుదిరింది. ఫెంటానిల్‌ తయారీకి ఉపయోగించే రసాయనాలను చైనా విక్రయిస్తున్నందుకు అమెరికా ఈ ఏడాది ప్రారంభంలో 20 శాతం సుంకాన్ని విధించింది. ఇప్పుడు దానిని 10 శాతానికి తగ్గించడానికి ట్రంప్‌ అంగీకరించారు. దీంతో చైనాపై విధించిన మొత్తం సుంకాల రేటు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గుతుంది.

త్వరలోనే వాణిజ్య ఒప్పందం : ట్రంప్‌
జిన్‌పింగ్‌తో సమావేశం ముగిసిన తర్వాత ట్రంప్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో వాషింగ్టన్‌ బయలుదేరారు. విమానంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చైనాపై విధించిన సుంకాలను తగ్గిస్తానని తెలిపారు. సమావేశానికి మీ రేటింగ్‌ ఎంత అని విలేకరులు ప్రశ్నించగా ‘సున్నా నుంచి పది వరకూ ఉండే స్కేలులో పది ఉత్తమమైనది. అయితే జిన్‌పింగ్‌తో జరిపిన సమావేశానికి నేను 12 రేటింగ్‌ ఇస్తాను’ అని చెప్పారు. ఏప్రిల్‌లో తాను చైనా వెళతానని, కొంతకాలం తర్వాత జిన్‌పింగ్‌ అమెరికా వస్తారని అన్నారు. చైనాకు మరిన్ని అధునాతన కంప్యూటర్‌ చిప్‌లను ఎగుమతి చేసే విషయంపై కూడా తాము చర్చించామని తెలిపారు. త్వరలోనే చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉన్నదని చెప్పారు.

ఈ ఒప్పందం విషయంలో రెండు దేశాల మధ్య పెద్దగా అడ్డంకులు లేవని అన్నారు. ఇంధన ఒప్పందంపై రెండు దేశాల అధికారులు త్వరలోనే సమావేశమై చర్చలు జరుపుతారని తెలిపారు. అమెరికా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించిందని చెప్పారు. రేర్‌ ఎర్త్స్‌ అంశం పరిష్కారం అయిందని, చైనా నుంచి వీటి ఎగుమతులకు ఇక ఎలాంటి అవరోధాలు ఉండవని అన్నారు. ఫెంటానిల్‌ రవాణాను ఆపేందుకు కృషి చేస్తానని జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారని తెలిపారు. అనేక అంశాలను తాము ముగింపు దశకు తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందు ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ సమావేశం జీ2 అవుతుందని, అది ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అమెరికా, చైనా దేశాలను గుర్తిస్తుందని తెలిపారు.

ఆర్థిక, వాణిజ్య అంశాలపై ఏకాభిప్రాయం : జిన్‌పింగ్‌
సమావేశం ప్రారంభానికి ముందు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని తెలిపారు. ‘రెండు దేశాలలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు పరస్పరం అప్పుడప్పుడు ఘర్షణ పడడం సహజమే’ అని ఓ అనువాదకుడి ద్వారా ఆయన చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని జిన్‌పింగ్‌ను ఉటంకిస్తూ చైనా అధికార వార్తా సంస్థ సిన్హువా తెలిపింది.

‘రెండు దేశాలకూ చెందిన ఆర్థిక, వాణిజ్య బృందాలు కీలకమైన అంశాలపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. వాటి పరిష్కారం దిశగా ఏకాభిప్రాయానికి వచ్చాయి’ అని జిన్‌పింగ్‌ వివరించారు. రెండు బృందాలు త్వరలోనే తిరిగి సమావేశమై తదుపరి చర్చలు కొనసాగిస్తాయని చెప్పారు. కాగా ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య సుమారు రెండు గంటల పాటు సమావేశం కొనసాగింది. అపెక్‌ సదస్సు జరిగిన జియోంగ్జూ నగరానికి దక్షిణంగా ఉన్న బుసాన్‌ ఈ భేటీకి వేదికైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -