నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్‌ల భేటీ ముగిసింది. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. రెండున్నర గంటలపైగా ఈ భేటీ సాగింది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్‌హౌస్, క్రెమ్లిన్‌లు ప్రకటించాయి.
అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్‌కు చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ట్రంప్‌కు చెందిన వాహనంలో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూశాయి. మరోవైపు అలస్కాలో వందలాది అమెరికన్లు ఒక్క చోటుకి చేరి ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అటు పుతిన్‌కు గానీ, ఇటు రష్యాకు గానీ వ్యతిరేకంగా ఎలాంటి ప్లకార్డులు దర్శనమివ్వక పోవడం గమనార్హం. మరోవైపు వీరి భేటీ నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. హై రికార్డ్స్ నుంచి కింద పడ్డాయి. యూఎస్ బాండ్లు, డాలర్ విలువ తగ్గింది.