ఇరాన్ దూకుడును అడ్డుకునేలా చర్యలు
బాలిస్టిక్ క్షిపణి తయారీలో సంబంధాలున్న సంస్థలు, వ్యక్తులపై నిబంధనలు
న్యూయార్క్ : ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంతో సంబంధాలున్న 32 సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది. వాటిలో భారత్, చైనా, ఇరాన్, హాంకాంగ్, యూఏఈ, టర్కీ తదితర దేశాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు ఉన్నారని అమెరికా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ”ఇరాన్, చైనా, హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, భారత్ తదితర దేశాల్లో ఉన్న 32 సంస్థలు, వ్యక్తులు ఇరాన్ క్షిపణి, డ్రోన్ వంటి ఉత్పత్తి నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తున్నందున ఆంక్షలు విధించాం” అని అమెరికా పేర్కొంది. ఇరాన్ తన అణు ఒప్పందంలో విఫలమైన నేపథ్యంలో సెప్టెంబర్‌లో యునైటెడ్ నేషన్స్ ఆంక్షలను మళ్లీ అమలు చేసిన నిర్ణయానికి మద్దతుగా ఈ చర్యలు తీసుకున్నామని స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
అమెరికా ట్రెజరీ శాఖలో టెర్రరిజం, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండర్ సెక్రెటరీ జాన్ కె హర్లీ మాట్లాడుతూ ‘ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ తన అణు, సాంప్రదాయ ఆయుధాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకుంటోంది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నాం’ అని అన్నారు. అంతర్జాతీయ సమాజం కూడా ఇరాన్‌పై, యూఎన్ ఆంక్షలను పూర్తిగా అమలు చేసి, గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ యాక్సెస్‌ను నిలిపివేయాలని ఆయన కోరారు. అదే విధంగా భారత్‌లోని ఫార్మ్‌లేన్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థను యూఏఈకి చెందిన మార్కో క్లింగే అనే కంపెనీతో లింక్ చేసినట్టు తెలిసిందని, ఈ సంస్థలు సోడియం క్లోరేట్, సోడియం పెర్క్లోరేట్ వంటి రసాయనాల సరఫరాలో ఇరాన్ ప్రాజెక్టులకు సహకరించినట్టు ఆరోపించారు. ‘ఇరాన్ క్షిపణి, డ్రోన్ ఉత్పత్తి సామగ్రి కొనుగోలు చర్యలను బహిర్గ తం చేయడానికి, వాటిని అడ్డుకుని నిలువరిం చడానికి సంస్థలపైనా విధించిన ఆంక్షలను కొనసాగిస్తాం. ఇలాంటి చర్యలు ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ స్థిరత్వానికి ముప్పుగా మారుతున్నాయి’ అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.



