తమ ప్రమేయం లేకుండా, ఆమోదం పొందకుండా ఉక్రెయిన్ సంక్షోభాన్ని డోనాల్డ్ ట్రంప్ ఎలా పరిష్కరిస్తాడో చూస్తామన్నట్లుగా ఐరోపా అగ్రదేశాలు. తన పరువు కాపాడాలని, తమకు మరిన్ని ఆయుధాలు, సాయం అందించాలంటూ ఎక్కే దిగే గుమ్మంగా జెలెన్‌స్కీ పరిస్థితి. ట్రంప్‌తో మాట్లాడిన తరువాత అవునంటాడు, ఐరోపా నేతలతో భేటీ తరువాత కాదంటాడు.క్రిస్మస్‌లోగా శాంతి ఒప్పందానికి అంగీకరించా లంటూ ట్రంప్ తాజా షరతు. బలహీనమైన కుట్రదారులతో కూడిన ఐరోపా నాయకత్వంలో ఆ ఖండం దిగజారుతున్నదంటూ ధ్వజం.వారు కబుర్లు తప్ప పనిచేయటం లేదంటూ ఆ 79 ఏండ్ల పెద్దమనిషి ఉక్రోషం. పోరులో ఉక్రెయిన్ ఓడిపోతున్నదని, గెలిచే అవకాశాలు లేవని బహిరంగంగా ఐరోపాను విస్మరిం చవద్దంటూ పోప్ లియో హితవు. శాంతి ప్రతిపాదనలపై ముందు మీలో మీరు ఒక ఏకాభిప్రాయానికి రండి, అప్పుడు మా వైఖరి చెబుతాం అన్నట్లుగా ఉన్న రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. వెరసి ఐదో యేటా ప్రవేశించబోతున్న ఉక్రెయిన్ పోరు ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం.
బుధవారం నాడు ఐరోపా నేతలతో ట్రంప్ ఫోన్ సంభాషణ జరిపాడు. సవరించిన ఇరవై అంశాల కార్యక్రమం గురించి వివరించాడు. గత కొద్ది రోజులుగా ఎడతెగని సంభాషణలు జరుపుతున్న జెలెన్‌స్కీ త్వరలో రక్తపాతం ఆగిపోతుందని ఎక్స్‌లో పోస్టు. ఐరోపా, అమెరికా ప్రమేయం లేకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేమన్న నిస్సహాయతను వెల్లడించాడు. ఐరోపా నేతల నుంచి ఉక్రెయిన్‌కు మద్దతు తప్ప ఇతరంగా ఎలాంటి ప్రకటనలూ లేవు.జెలెన్‌స్కీ పదవీ కాలం ఎప్పుడో ముగిసిందని అతనికి ఒప్పందం కుదుర్చుకొనే అర్హత లేదని పుతిన్ చెబుతున్నాడు. దానికి మద్దతుగా అన్నట్లు ఉక్రెయిన్ ఎన్నికల గురించి డోనాల్డ్ ట్రంప్ కూడా తాజాగా మాట్లాడుతున్నాడు.పోరు పేరుతో పోలింగ్ వాయిదా వేయటం ఏమిటి, ఇదేం ప్రజాస్వామ్యం అంటున్నాడు. జెలెన్‌స్కీ పదవీకాలం 2024 మేనెలలోనే ముగిసింది. అక్కడ 2022 నుంచి మార్షల్ లా అమల్లో ఉంది. అటువంటపుడు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరపకూ డదని, తదుపరి ఎన్నికలు జరిగే వరకు అధ్యక్షుడిగా కొనసాగే హక్కు తనకు ఉందని జెలెన్‌స్కీ చెబుతున్నాడు.
ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభానికి ముందు నుంచీ రష్యా తన వైఖరిని స్పష్టంగా చెబుతూనే ఉంది.నాటో కూటమిలో కీవ్‌ను చేర్చుకోవద్దు, మా ముంగిట ఆయుధాలను మోహరించవద్దని 2014కు ముందు నుంచీ చెబుతూనే వస్తుంది. కానీ, నాటో కుట్రల కారణంగా దాన్ని ఎదుర్కొనేందుకు అంతవరకు ఉక్రెయిన్‌లోనే కొనసాగిన తన పూర్వపు ప్రాంతమైన క్రిమియాను రష్యా విలీనం చేసుకుంది. పశ్చిమ దేశాలు తమ పథకంతో ముందుకు పోతుండటంతో 2022 ఫిబ్రవరి చివరి వారంలో మిలిటరీ చర్యకు దిగింది. నాటి నుంచి నేటి వరకు ఇరవై శాతం ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చు కుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న జనం ఉక్రెయిన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నందున వాటిని రిపబ్లిక్‌లుగా గుర్తించా లని కోరుతోంది. ఇది నాటో కూటమి దేశాలకు ఊహించని ఎదురుదెబ్బ, స్వయంకృతం. ఈ ప్రాంతాలను రష్యాకు అప్పగించి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను అటు ఐరోపా, ఉక్రెయిన్ కూడా అంగీకరించటం లేదు. దిక్కుతోచని ట్రంప్ ఇప్పటివరకు ఉక్రెయిన్‌ను బెదిరింపులు, బుజ్జగింపులతో దారికి తెచ్చేందుకు చూస్తున్నాడు. ఇప్పుడు ఐరోపా దేశాలను కూడా బెదిరించేందుకు పూనుకున్నాడు.
సూటిగా చెప్పలేక వలసల గురించి సరైన వైఖరి తీసుకోవటం లేదని, అసమర్ధంగా వ్యవహరిస్తున్న కారణంగా ఐరోపా దిగజారిపోతున్నదని దాడి ప్రారంభించాడు. ఉక్రెయిన్ కంటే రష్యా ఎంతో పెద్దది, ఉక్రెయిన్ ఓడిపోతున్నదంటూ మాట్లాడుతున్నాడు. అయితే అలాంటిదేమీ లేదని గతేడాది కాలంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలు ఒకశాతం కూడా లేవంటూ ఐరోపా దేశాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక్క అంగుళం కూడా తమ ప్రాంతాన్ని వదులుకొనేది లేదని, అమెరికా, ఐరోపా తమకు సాయం చేస్తే రష్యాను నిలువ రించటమేగాక తరిమివేస్తామని జెలెన్‌స్కీ చెబుతు న్నాడు. సంక్షోభం కొనసాగితే రాజకీయంగా పార్లమెంటు ఎన్నికల్లో తనకు దెబ్బ అని ట్రంప్ భయపడుతున్నాడు.ఈ పరిస్థితి ఐరోపాకూ ఇబ్బందికరమే. ఆంక్షలు రష్యానేమీ చేయలేక పోయాయి, కొండంత అండగా చైనా నిలిచింది. తాము సృష్టించిన సమస్య నుంచి బయటపడేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యం, దాని అనుయాయులుగా ఉన్న ఐరోపా ధనిక దేశాలు ఇలాంటి పరిస్థితిని ఏ మాత్రం ఊహించి ఉండవు.ప్రపంచ రాజకీ యాలు, బలాబలాలను ప్రభావితం చేసే ఈ సంక్షోభం ఎలా పరిష్కారం అవుతుందనేది ఎవరికీ అంతుబట్టడం లేదంటే అతిశయోక్తి కాదు.
ట్రంప్ ఉక్రోషం,నిస్సహాయత!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


