గాజాపై ఇజ్రాయిల్ దాడిలో 19 మంది మృతి
ఈజిప్టులో శాంతి చర్చలకు ముందు బరితెగించిన నెతన్యాహు
గాజా : రెండేండ్ల యుద్ధానికి తెరదించేలా చర్యలు తీసుకున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తుంటే..మరోవైపు ఈజిప్టులో శాంతి చర్చలకు హమాస్ సిద్ధమవుతున్న తరుణంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు బరితెగించాడు. ట్రంప్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఆదివారం ఇజ్రాయిల్ తెగబడింది. క్షిపణి దాడుల్లో 19 మంది పాలస్తీయన్లు మృతిచెందారు.మరోకరు ఆకలికోరల్లో చనిపోయారు. ఇజ్రాయిల్ యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ..ఆమ్సాడ్రమ్, ఇస్తాంబుల్‌లో భారీ నిరసనలు కొనసాగాయి. ప్లకార్డులు, బ్యానర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. గాజాకు మానవతా సహాయం తీసుకువెళుతున్న ఫ్లోటిల్లాలో పాల్గొన్న కార్యకర్తలను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసనలు కొనసాగుతున్నాయి.2023 అక్టోబర్ నుంచి గాజాపై ఇజ్రాయిల్ యుద్ధంలో కనీసం 67,139 మంది మరణించారు . 169,583 మంది గాయపడ్డారు. వేలాది మంది శిథిలాల కింద సమాధి అయి ఉంటారని భావిస్తున్నారు. 2023 అక్టోబర్ 7న జరిగిన దాడుల సమయంలో ఇజ్రాయిల్‌లో మొత్తం 1,139 మంది మరణించారు . దాదాపు 200 మందిని బందీలుగా తీసుకెళ్లారు.