– సభ్యదేశాలపై 10 శాతం అదనపు టారిఫ్ విధిస్తానని బెదిరింపు
– అమెరికావి విచక్షణారహిత సుంకాలు : బ్రిక్స్
– ఇరాన్‌పై ఇజ్రాయిల్- అమెరికా దాడులను ఖండిస్తూ తీర్మానం
వాషింగ్టన్ : బ్రిక్స్ సభ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో ఊగి పోతున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా బ్రిక్స్‌లోని 11 దేశాలపై మరో పది శాతం సుంకం విధిస్తానని ప్రకటించారు. ‘అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బ్రిక్స్‌తో ఏ దేశం జత కట్టినా దానిపై మరో పది శాతం సుంకాన్ని విధిస్తాము. దీనికి మినహాయింపులేవీ ఉండవు’ అని ఆదివారం తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో హెచ్చరించారు. ఇదిలావుండగా డోనాల్డ్ ట్రంప్ విధించిన ‘విచక్షణారహిత’ దిగుమతి సుంకాలపై బ్రిక్స్ సదస్సు విమర్శలు కురిపించింది. ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా జరిపిన దాడులనూ నిరసిం చింది. బ్రిక్స్ సభ్య దేశాలు ప్రపంచ జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహిస్తు న్నాయి. అంతర్జా తీయ ఆర్థిక ఉత్పత్తిలో ఈ దేశాల వాటా 40 శాతం వరకూ ఉంది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య అనేక అంశాలపై భిన్నాబి óప్రాయాలు ఉన్నాయి. అయితే స్థిరత్వం లేని అమెరికా అధ్యక్షుడి విధానాలు, ఆయన సుంకాల యుద్ధాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అమెరికాపై పరోక్ష విమర్శలు చేస్తూ బ్రిక్స్ సభ్య దేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. సుంకాల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అవి డబ్ల్యూటీఓ నియమాలకు విరుద్ధమని ఆరోపించాయి. ఈ పరిమితులు ప్రపంచ వాణిజ్యానికి ముప్పుగా పరిణమిస్తాయని, అనిశ్చిత పరిస్థితికి దారితీస్తాయని తెలిపాయి.
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ సైనిక చర్యను బ్రిక్స్ తప్పుపట్టింది. అయితే అదే సమయంలో రష్యాపై ఎలాంటి విమర్శలు చేయకుండా జాగ్రత్త పడింది. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌ను కేవలం ఒకసారి మాత్రమే ప్రస్తావించింది. రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కాలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సభ్య దేశమైన ఇరాన్‌కు మద్దతు తెలిపిన బ్రిక్స్ సదస్సు…ఆ దేశంలోని అణు-ఇతర లక్ష్యాలపై ఇజ్రాయిల్, అమెరికా జరిపిన వరుస సైనిక దాడులను ఖండించింది. కాగా ఐక్యరాజ్యసమితిలోని ప్రతి సభ్యుడు ఇజ్రాయిల్ చర్యలను తీవ్రంగా ఖండించాలని కోరానని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ చెప్పారు. హక్కుల ఉల్లంఘనలకు ఇజ్రాయిల్, అమెరికా బాధ్యత వహించాలని అన్నారు. యుద్ధానంతర పరిణామాలు కేవలం ఒక్క దేశానికే పరిమితం కావని తెలిపారు. మధ్య ప్రాచ్యంతో పాటు ఇతర ప్రాంతాలు కూడా నష్టపో తాయని ఆయన చెప్పారు. గాజాలో నెలకొన్న మానవతా పరిస్థితులపై బ్రిక్స్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బందీలందరినీ విడుదల చేయాలని, చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.
మా వైఖరిలో మార్పులేదు
”టారిఫ్ విధింపు విషయంలో మా స్పందనలో ఏ మార్పు లేదు. సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు. రక్షణాత్మక వైఖరితో ముందుకువెళ్లలేం”…
చైనా పునరుద్ఘాటన వాణిజ్య సుంకాల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లక్రితం చైనా-అమెరికాల మధ్య సుంకాల యుద్ధం నడిచింది. ట్రంప్‌కు షాకిచ్చేలా చైనా తీసుకున్న నిర్ణయాల తర్వాత రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో అది కొద్దిమేర సమసి పోయిన విషయం విదితమే.