ట్రంప్ సుంకాల బాదుడు గురించి మీడియా అదేదో మామూలుగా జరిగే వ్యవహారమే అన్నట్టు యథా లాపంగా చర్చిస్తోంది. ఆ సుంకాల విధింపు ఏ ప్రత్యేక నేపథ్యంలో జరుగుతోందో దాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తాను పెంచిన సుంకాల ద్వారా సమకూరే అదనపు ఆదాయాన్ని ఉపయోగించి అమెరికా అదనపు సరు కులను గాని సేవలను గాని కొనుగోలు చేయబోవడం లేదు. దాని గురించి దిగువ వివరిస్తాను. ట్రంప్ పెంచిన సుంకాల ప్రభావం వలన ఇంతవరకూ అమెరికాకు తమ దేశాల సరుకులను ఎగుమతి చేస్తున్న దేశాలు ఇకపైన అదే మోతాదులో ఎగుమతి చేయలేవు. ఆయా దేశాలు ఎంత మేరకు ఎగుమతి మార్కెట్లను కోల్పోయాయో ఆ మేరకు తమ తమ దేశాల్లో అంతర్గత మార్కెట్లను ఇప్పుడు విస్తరించేలా చర్యలు తీసుకోలేవు. అలా చేయాలంటే ఆ దేశాల ప్రభుత్వాలు అదనపు వ్యయాన్ని చేయాలి. అందుకోసం తమ బడ్జెట్‌లో ద్రవ్యలోటునైనా పెంచాలి లేదా తమ దేశాలలోని ధనవంతుల మీద అదనపు పన్నులనైనా వేయాలి.
ఈ రెండింటిలో ఏది చేసినా అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు ఆ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలను ధిక్కరించగల స్థితిలో ఈ దేశాలు లేవు. అమెరికా చేపట్టిన ‘రక్షణాత్మక’ చర్యల ఫలితంగా మొత్తంగా ప్రపంచ స్థూల డిమాండ్ కుదించుకు పోతుంది. దానివలన ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమౌతుంది. ట్రంప్ సుంకాలు అమెరికాలో దేశీయ ఉత్పత్తుల మోతాదును కొంతవరకూ పెంచవచ్చు. దాని ఫలితంగా కొంత ఉపాధి కల్పన అక్కడ జరగవచ్చు. కాని అమెరికాతో సహా మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కలిపి చూసినప్పుడు స్థూల ప్రపంచ డిమాండ్ ముడుచుకు పోతుంది కనుక ప్రపంచ ఆర్థిక సంక్షోభం మరింత ముదిరిపోతుంది. ఈ ప్రపంచ స్థూల డిమాండ్ ఏ విధంగా ట్రంప్ సుంకాల పర్యవసానంగా పడిపోతుందో ఇప్పుడు చూద్దాం.
ఏదైనా ఒక దేశం తాను దిగుమతి చేసుకునే సరుకుల మీద సుంకాలను పెంచినప్పుడు అలా దిగుమతయ్యే సరుకుల రేట్లు ఆ దేశంలో పెరుగుతాయి. అదే మోతాదులో ఆ దేశంలోని వేతనాలు మాత్రం పెరగవు. అందుచేత దిగుమతి చేసుకునే బదులు తమ దేశంలోనే ఆ సరుకులను ఉత్పత్తి చేయడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. దిగుమతి సుంకాలను పెంచినంత మాత్రాన అన్ని దిగుమతులూ నిలిచిపోవు, కొన్ని సరుకుల దిగుమతుల మాత్రం నిలిచిపోతాయి. సుంకాలు పెంచిన అనంతరం కూడా దిగుమతయ్యే సరుకుల మీద వసూలు చేసే అదనపు సుంకాల వలన ఆ సరుకుల రేట్లు పెరుగుతాయి.వాటిని కొనుగోలు చేసేవారిలో అత్యధికులు శ్రామిక ప్రజలే. అంటే దిగు మతులమీద అదనపు సుంకాలను విధించినందు వలన ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి ఆమేరకు పడిపోతుంది.
ప్రభుత్వానికి అదనపు సుంకాల ద్వారా సమకూరే ఆదాయాన్ని గనుక ఆ ప్రభుత్వం తిరిగి ఖర్చు చేసేస్తే, అప్పుడు ప్రభుత్వ ఖర్చు, శ్రామిక ప్రజానీకపు ఖర్చు కలిపి లెక్కించినప్పుడు తేడా రాదు. సుంకాల పెంపుకు ముందు ఉన్నట్టే ఇప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం కనుక అలా ఖర్చు చేయకపోతే, అప్పుడు శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి పడి పోయిన మేరకు ఆ దేశపు స్థూల డిమాండ్ తగ్గుతుంది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అదనపు సుంకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి ఖర్చు చేయబోవడం లేదు. అందుచేత అమెరికాలో స్థూల డిమాండ్ తగ్గుతుంది.
ప్రస్తుతం ట్రంప్ అమెరికన్ బడా సంపన్నులకు భారీగా పన్ను రాయితీలను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు అదనపు సుంకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ రాయితీల నిమిత్తం ఖర్చు చేయబోతున్నాడు. అంటే ఈ ఆదాయం బడ్జెట్ ద్రవ్యలోటును తగ్గించడానికి వాడతారే తప్ప ప్రభుత్వ ఖర్చును పెంచడానికి మాత్రం కాదు. అంటే అమెరికా దిగుమతి సుంకాలను పెంచి ఆర్జించే ప్రతీ డాలరూ ఆ మేరకు అమెరికాలో స్థూల డిమాండ్‌ను తగ్గించి వేస్తుంది. అమెరికాలో తగ్గే డిమాండ్‌ను భర్తీ చేయడానికి ప్రపంచంలో మరే దేశంలోనైనా ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతారా అంటే అదీ సాధ్యం కాదు. అందుచేత మొత్తంగా ప్రపంచాన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నప్పుడు స్థూల డిమాండ్ స్థాయి దిగజారిపోతుంది. దాని ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం మరింత తీవ్రంగా మారుతుంది.
అమెరికాలో దేశీయంగా ఉత్పత్తులు కొంతమేరకు పెరగవచ్చు. దిగుమతులు తగ్గుతాయి కనుక అందులో కొంతమేర కైనా భర్తీ చేసుకోడానికి ఆ విధంగా దేశీయ ఉత్పత్తి పెరగవచ్చు. కాని అది అక్కడ తగ్గిపోయే దిగుమతుల కన్నా ఎక్కువగా ఏమీ పెరిగిపోదు. అమెరికా లో మాంద్యం కొంత తగ్గుముఖం పట్టొచ్చు కాని ప్రపంచం మొత్తంగా చూసుకున్న ప్పుడు ఆర్థిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టక తప్పదు.
ఇప్పుడు అమెరికా అనుసరిస్తున్న విధానం వలన అమెరికాలో కొంత ఉపాధి కల్పన జరగొచ్చు కాని ఇతర దేశాల్లో నిరుద్యోగం పెరుగుతుంది. అంటే అమెరికా తన నిరుద్యోగాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందన్నమాట. నిజానికి ఇది కేవలం అంతవరకే పరిమితం కాదు కూడా. ఉదాహరణకు అమెరికా సుంకాలను పెంచిన ఫలితంగా, దిగుమతులు తగ్గి, వాటిని భర్తీ చేయడానికి తన దేశంలోనే వాటిని ఉత్పత్తి చేయడానికి పూనుకుందను కుందాం. అప్పుడు అమెరికాలో పెరిగే ఉత్పత్తి 100 పాయింట్లు ఉంటే, తక్కిన ప్రపంచంలో తగ్గిపోయే ఉత్పత్తి 100కే పరి మితం కాదు. అది 120 లేదా 150 పాయింట్ల దాకా ఉంటుంది. అందుచేత వాస్తవానికి అమెరికాలో ఉత్పత్తి కార్య కలాపాలు పెరిగిన మేరకు మించి ప్రపంచం మొత్తం మీద తగ్గుదల ఉంటుంది.
అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా మరికొన్ని దేశాలు తమ సుంకాలను కూడా పెంచవచ్చు. కాని అలా పెంచినంత మాత్రాన ప్రపంచ స్థూల డిమాండ్ తగ్గుదల నిలిచిపోదు. ఈ దేశాలన్నీ దాదాపుగా నయా ఉదారవాద చట్రానికి లోబడే వ్యవహరిస్తున్నాయి. అవి తాము పెంచిన సుంకాల వలన వచ్చిన అదనపు ఆదాయాలను ద్రవ్య లోటును తగ్గించుకోడానికి మళ్ళిస్తాయి. లేకపోతే, తమ దేశాల్లోని సంపన్నులకు మరింత రాయితీలను కల్పిం డానికి ఖర్చు చేస్తాయి. అంతే తప్ప దేశీయ డిమాండ్ ను పెంచేలా ఖర్చు చేయవు. ఆ దేశాలలో అటు దేశీయ కార్మి కుల కొనుగోలుశక్తీ పడిపోతుంది (ఎగుమతులు తగ్గిపోయి ఉపాధి తగ్గినందువలన). ఇటు దేశీయ వ్యయమూ పెరదు. దాని ఫలితంగా ప్రపంచ స్థూల డిమాండ్ మరింత పడిపోతుంది. ప్రతీకార సుంకాల విధింపు ద్వారా ఆ యా దేశాలు తమ అమెరికా ఎగుమతులను తగ్గించుకుని ఆ మేరకు ఉత్పత్తిని దేశీయ మార్కెట్ లోకి మళ్లించ గలుగు తాయేమో కాని ప్రపంచ పెట్టుబడిదారీ మార్కెట్ మొత్తం మీద చూసినప్పుడు మాత్రం డిమాండ్ తగ్గిపోయి నయా ఉదారవాద ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరం కాక మానదు.
ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న చర్చ అంతా డిమాండ్‌ను అమెరికా నుండి దేశీయంగా మళ్లించడం అన్న అంశం మీదనే సాగుతోంది తప్ప ప్రపంచ పెట్టుబడిదారీ మార్కెట్ మొత్తంగా ఏం కానున్నది అన్న దాని మీద లేదు. అదనపు సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఒనగూడే అదనపు ఆదాయాన్ని ఆ ప్రభుత్వం ప్రజల మధ్య ఖర్చు చేసిన ప్పుడు మాత్రమే దేశీయ డిమాండ్ ఆ మేరకు పెరుగుతుంది తప్ప అలా ఖర్చు చేయకుండా ద్రవ్య లోటును భర్తీ చేయ డానికో లేక సంపన్నులకు మరిన్ని రాయితీలను కల్పించడానికో ఖర్చు చేస్తే అప్పుడు మొత్తంగా ప్రపంచ డిమాండ్ ముడుచుకుపోతుంది.
ఇప్పుడు పెట్టుబడిదారీ ప్రపంచానికి నాయకుడిగా అమెరికా ఉంది. అందుచేత ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించి ఆ దారిన ముందు అమెరికా నడుస్తుందని, తన వెంట తక్కిన సంపన్న పెట్టుబడి దారీ దేశాలను తీసుకుపోతుందని ఉదారవాద బూర్జువా ఆర్థిక పండితులు భావిస్తున్నారు. 1930 దశకంలో నెలకొన్న సంక్షోభం సమయంలో జె.ఎం.కీన్స్ సంపన్న పెట్టుబడిదారీ దేశాల నుండి అటువంటి ఉమ్మడి ప్రయత్నాన్నే ఆశిం చాడు. కాని ఇప్పుడు తక్కిన పెట్టుబడిదారీ ప్రపంచాన్ని పట్టించుకోకుండా అమెరికా మాత్రం తన వరకూ తాను ఈ సంక్షోభం నుండి ఏ విధంగానైనా బైట పడాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం తక్కిన పెట్టుబడిదారీ ప్రపంచం మీద వత్తిడి పెంచుతోంది. ఈ వత్తిడి ముఖ్యంగా మూడవ ప్రపంచం లోని పెట్టుబడిదారీ దేశాల మీద ఎక్కువగా పెంచు తోంది. ”మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్” అని ట్రంప్ ఇచ్చిన నినాదం పెట్టుబడిదారీ ప్రపంచం సంక్షోభం నుండి బయట పడేందుకు దారి చూపదు సరికదా, అది అమెరికా వరకూ సంక్షోభం నుండి బయటపడి, తక్కిన దేశాలు, ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలు మరింత సంక్షోభంలోకి కూరుకుపోడానికి దారి తీస్తుంది.
ట్రంప్ దుర్మార్గుడు అయినందువల్లో, లేదా అతడు మూర్ఖుడు కాబట్టే ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని అనుకోకూడదు. అతడు పెట్టుబడిదారీ సహజ న్యాయానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నాడు. ఉదారవాద బూర్జువా ఆర్థిక పండితులు ఏదో ఆశాజనకమైన స్థితిని ఊహించుకుంటున్నారు కాని వారికి ఈ వాస్తవం పట్టినట్టు లేదు. పెట్టు బడిదారీ వ్యవస్థ ఒక ప్రణాళికాబద్ధ విధానానికి లోబడి నడుచుకునేది కాదు. ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఏదైనా ఒక ”హేతుబద్ధ” పరిష్కారం ఉందనుకున్నా ఆ పరిష్కారానికి అది కట్టుబడదు. అందుచేత అమెరికా ఈ సంక్షోభ సమయంలో తన దారేదో తాను చూసుకుంటోంది. అందుకోసమే అమెరికా వివిధ దేశాలతో జరుపుతున్న వాణిజ్య సుంకాల చర్చల్లో, ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలతో జరుపుతున్న చర్చల్లో పలు డిమాండ్లను ముందుకు తెస్తోంది. తాను అధిక సుంకాలు విధిస్తానని ప్రకటించిన ఏ దేశమైనా అమెరికన్ సరుకులను ‘జీరో’ సుంకంతో దిగుమతి చేసుకోడానికి ఒప్పుకుంటే ఆ దేశం మీద సుంకాలను తగ్గిస్తానని బేరమాడుతోంది. ఈ పద్ధతిలో అది పలు దేశాలతో కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
కాని అటువంటి ఒప్పందాల వలన మూడవ ప్రపంచ దేశాలు వినాశకర పర్యవసానాలను చవిచూడవలసి వస్తుంది. ఇండియా వరకు చూసుకుంటే మన దేశం గనుక అమెరికన్ డెయిరీ ఉత్పత్తులు, బాదం పప్పు, పిస్తా, కొన్ని రకాల ఫలాలు వంటివి జీరో సుంకంతో దిగుమతి చేసుకోడానికి అంగీకరిస్తే అప్పుడు అమెరికా మన దేశం నుంచి దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, ఫార్మస్యూటికల్స్ వంటి సరుకుల దిగుమతుల మీద సుంకాలను తగ్గించవచ్చు. అప్పుడు భారతీయ రైతాంగం అమెరికా నుండి వచ్చిపడే వ్యవసాయ ఉత్పత్తుల పోటీకి తట్టుకోలేక కుదేలౌతారు. అమెరికన్ రైతాంగం మన రైతులకన్నా ఎందులోనూ గొప్పగా పొడిచేసిందేమీ లేదు కాని వాళ్ళకి అమెరికన్ ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ తక్కిన దేశాలు సబ్సిడీలు ఇవ్వడానికి అభ్యంతరం చెప్పింది కాని అమెరికా ఇచ్చే సబ్సిడీలను మాత్రం ఆమోదించింది.
ఇప్పుడు నయా ఉదారవాద విధానాలు మన దేశాన్ని ఒక మూలకు నెట్టాయి. ఇప్పుడు మన దేశం అటు రైతుల ప్రయోజనాలనైనా బలి చేయాలి లేదా ఫార్మా, ఆభరణాల తయారీ, వజ్రాల తయారీ వంటి రంగా ప్రయో జనాలనైనా బలి చేయాలి. ఏది జరిగినా మన దేశానికి నష్టమే. అందుచేత అసలు ఈ నయా ఉదారవాద చట్రం నుం డి మొత్తంగానే మన దేశాన్ని బైటకు తెచ్చుకుని ఇప్పుడున్న చిక్కుపరిస్థితుల నుండి విముక్తి చేయాలి. అదే మార్గం.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
పెట్టుబడిదారీ ప్రపంచాన్ని ముంచనున్న ట్రంప్ సుంకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES