– ఉస్మాన్‌సాగర్ 8 గేట్లు ఎత్తిన అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌కు మళ్లీ వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో జలాశయాల్లోకి వరద పోటెత్తుతోంది. వాటర్‌బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. గండిపేట జలాశయం 8 గేట్లను మూడు అడుగు మేర ఎత్తారు. గండిపేటకు ఇన్‌ఫ్లో 900 రావడంతో 8 గేట్ల ద్వారా 2704 క్యూసెక్కుల నీటిని దిగువన మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 21800 కావడంతో 3 గేట్ల ద్వారా 2300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదిలో వరద ప్రవాహం పెరిగింది.
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినట్టు అధికారులు చెబుతున్నారు. బంజారా, పికెట్, కూకట్‌పల్లి నాలాల నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి వరద వస్తోంది. హుస్సేన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 1520 క్యూసెక్కులు ఉండగా.. 1190 క్యూసెక్కుల నీరు మూసీలోకి విడుదల చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.75 మీటర్లు కాగా, ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు ఉంది. హుస్సేన్‌సాగర్ నుంచి తూముల ద్వారా నీటిని మూసీలోకి వదులుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.