అడహక్ కమిటీ కన్వీనర్‌గా రాంచందర్
అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇండస్థలాలపై సర్కారుకు వినతులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర మహాసభలను వచ్చే సంవత్సరం జనవరి చివరి వారంలో నిర్వహించాలని సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం (సర్వసభ్య సమావేశం) తీర్మానం చేసింది. మహాసభల నిర్వహణ కోసం సీనియర్ జర్నలిస్ట్, సంఘం సీనియర్ ఉపాధ్యక్షులు పి.రాంచందర్ కన్వీనర్‌గా నియమించింది. మరో 23 మందితో అడహక్ కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ జర్నలిస్ట్ పిల్లి రాంచందర్ అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య, ఉపాధ్యక్షులు బి రాజశేఖర్, జి. మాణిక్ ప్రభు, తాటికొండ కృష్ణ, గుడిగ రఘు, కార్యదర్శులు ఎస్ కే సలీమ, ఈ చంద్రశేఖర్, బి. జగదీష్, కొప్పు నిరంజన్, బి. దయాసాగర్, గండ్ర నవీన్, దామోదర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మణిమాల, విజయ, బీవీఎన్ పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యులు, 33 జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, స్టేట్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్, అక్రిడిటేషన్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అక్రిడిటేషన్లు, ఇండ్లస్థలాలు, హెల్తాకార్డుల విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. మామిడి సోమయ్య, బండి విజయ్ కుమార్, వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, కుడితూడి బాపూరావు ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు సంఘం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం చేసిన తీర్మానాన్ని విస్తృతస్థాయి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. బహిష్కరణకు గురైన వారికి ఇక నుంచి టీడబ్ల్యూజేఎఫ్ తో ఎలాంటి సంబంధం లేదని ఫెడరేషన్ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం స్పష్టం చేసింది. ఫెడరేషన్ పేరుతో వారు ఎలాంటి కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహించరాదని సమావేశం తీర్మానించింది. ఈ విషయాన్ని జర్నలిస్టులు, ఫెడరేషన్ శ్రేయోభిలాషులు గ్రహించాలని విజ్ఞప్తి చేసింది. ఏకపక్షంగా సోమయ్య వేసిన జిల్లా కమిటీలను రద్దు చేస్తున్నట్టు విస్తత కార్యవర్గం ప్రకటించింది.



