మరో 78 మందికి గాయాలు
దేవరగట్టు : కర్నూలు జిల్లాలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్నియాత్ర మరోసారి రక్తమోడింది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..ముందస్తు చర్యలు చేపట్టినా ఈ ఏడాది కూడా హింస చెలరేగింది. రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. 78 మందికి గాయాలయ్యాయి. వారిలో 8మంది పరిస్థితి విషమంగా ఉంది. కర్రల సమరంలో గాయపడ్డ వారిని ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి.. స్వామి, అమ్మవారి కల్యాణోత్సవం తర్వాత ఊరేగింపు జరిగింది. అనంతరం దేవతా మూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల ప్రజలు మరోవైపు కర్రలతో తలపడ్డారు. దీంతో హింస చెలరేగింది.
చాలా మంది గ్రామస్తులు గాయాలపాలైనా కూడా పసుపు పూసుకుని ఎలాంటి చికిత్స తీసుకోకుండానే స్వగ్రామానికి వెళ్లిపోయారు. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాల మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయదశమి రోజు జైత్రయాత్రగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో జరిగే కర్రల సమరంలో పలువురు భక్తులు మృతి చెందడం.. పెద్దసంఖ్యలో గాయపడటం పరిపాటిగా మారింది. ఈ సమరాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. మరోవైపు ఈ ఉత్సవాన్ని చిత్రీకరించేందుకు విదేశీ మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు.
దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -