– సభ్యులకు రూ.25 లక్షల రివార్డు అందజేత : రామగుండం సీపీ అంబటి కిషోర్
నవతెలంగాణ- గోదావరిఖని
రెండు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు రామగుండం పోలీసు కమిషనర్ ఎదుట లొంగిపోయారు. సీపీ అంబటి కిషోర్ సమక్షంలో ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న, చౌదరి అంకుబారు అలియాస్ అనితక్క (లక్ష్మి) మంగళవారం లొంగిపోయారు. వారిని సీపీ సన్మానించి, రూ.25 లక్షల రివార్డు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. లచ్చన్న 1993లో సీపీఐ(ఎంఎల్)లో సభ్యునిగా చేరి చెన్నూరు దళంలో పనిచేశాడు. 2002లో సిర్పూర్ దళానికి డిప్యూటీ కమాండర్‌గా పదోన్నతి పొందాడు. లచ్చన్నపై తెలంగాణలో 35 కేసులున్నాయి. 1989లో లచ్చన్న, చౌదరి అంకుబాయిని వివాహం చేసుకున్నాడు. అంకుబారుపై కూడా కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 14 కేసులు ఉన్నాయి. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు తమ ఊర్లకు తిరిగి వచ్చి ప్రశాంత జీవితాన్ని గడపాలని సీపీ అంబటి కిషోర్ కోరారు. లొంగిపోవాలనుకునే వారికి పోలీసులు అన్ని విధాలా సహకారం అందిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే పునరావాస పథకాల ద్వారా వారికి అవసరమైన సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగి గ్రామాలకు తిరిగి రావాలని సూచించారు. కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల పేరుతో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. కాగా, కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టులు హింసను ప్రేరేపిస్తున్నారని, ఇవి ఇప్పుడు పని చేయడం లేదని లచ్చన్న తెలిపారు.
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES