న్యూఢిల్లీ : కెనడా దేశాన్ని వేదికగా చేసుకుని ఖలిస్థానీలు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు కెనడా ప్రభుత్వం ‘టెర్రర్ ఫైనాన్సింగ్’ పై తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. రెండు ఖలిస్థానీ సంస్థలకు తమ దేశం నుంచే నిధులు అందాయని ఆ నివేదికలో తెలిపింది. ఆ రెండు గ్రూపులను ‘బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్’, ‘ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్’ గా పేర్కొన్నది. ‘2025 అసెస్‌మెంట్ ఆఫ్ మనీలాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్ ఇన్ కెనడా’ పేరిట అక్కడి ప్రభుత్వం ఈ నివేదికను రూపొందించింది. ”రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం విభాగంలో ఉన్న హమాస్, హెజ్‌బొల్లా, ఖలిస్థానీ వంటి ఉగ్ర సంస్థలకు కెనడా నుంచే నిధులు సమకూరుతున్నట్టు అధికారులు గుర్తించారు. భారత్‌లోని పంజాబ్‌లో స్వతంత్ర దేశస్థాపన కోసం హింసాత్మక మార్గాలకు మద్దతు ఇచ్చే ఖలిస్థానీ సంస్థలు కెనడా సహా అనేక దేశాల్లో నిధులు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వీటికి గతంలో కెనడాలో విస్తృతమైన నిధుల సేకరణ నెట్‌వర్క్ ఉండేది. కానీ ఇప్పుడు ఖలిస్థానీవాదానికి తోడ్పాటునందించే వ్యక్తులే ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది” అని నివేదిక పేర్కొన్నది. ”హమాస్, హెజ్‌బొల్లాలు నిధుల కోసం ఛారిటబుల్ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. ఖలిస్థానీ మూకలు సైతం స్వచ్ఛంద సంస్థలతోపాటు తమ నెట్‌వర్క్ ద్వారా నిధుల సేకరణ, తరలింపు చేపట్టాయి. అయితే, ఈ మార్గాల ద్వారా సమకూరే నగదు అంతంత మాత్రమే. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అనేది కెనడాకు అతిపెద్ద మనీలాండరింగ్ ముప్పుగా ఉంది” అని నివేదిక వివరించింది.