Monday, December 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరెండేండ్లుగా తిరోగమనం

రెండేండ్లుగా తిరోగమనం

- Advertisement -

– ఆర్థికవేత్త డి.పాపారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రెండేండ్లుగా రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నదని ప్రముఖ ఆర్థికవేత్త డి.పాపారావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ నాలెడ్జ్‌ క్రియేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన ”రెండేండ్ల పరిపాలనలో ఏం జరిగింది?” అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాపారావు మాట్లాడారు. రాష్ట్రంలో 2015లో 1,209 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే, 2023 నాటికి ఆ సంఖ్య 48కు తగ్గిందని తెలిపారు. తిరిగి గత రెండేండ్లలో 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే రాష్ట్రం తిరోగమనంలో వెళ్తుందనేందుకు నిదర్శనమని చెప్పారు. ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనే మెరుగ్గా ఉండేదని వ్యాఖ్యానించారు. ఎంవీఎఫ్‌ నేషనల్‌ కన్వీనర్‌ ఆర్‌.వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో టీచర్ల పోస్టులు ఖాళీ ఉండేవనీ, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి పోస్టు ఖాళీగా ఉందని విమర్శించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఏడాది తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ప్రయివేటుకు రూ.20 వేల కోట్లు ధారపోస్తున్నారనీ, ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. పిల్లల గురించి ఆలోచన చేయకుండా 2047 రైజింగ్‌ మాట్లాడటంలో ఉపయోగం లేదన్నారు. యుపీఏ హయాంలో తెచ్చిన విద్యా హక్కు చట్టంపై రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమే స్పందించకపోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు. ఫీజులను నియంత్రించకపోవడంతో ప్రయివేటు దోపిడీ ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు నాయకులు రాజన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా విత్తన చట్టం తేవడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ వాసుదేవారెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ పల్లె రవికుమార్‌ తదితరులు మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -