అమెరికాలో నిపుణులు లేరని అంగీకరించిన ట్రంప్
విదేశీయుల అవసరం ఉన్నదని వ్యాఖ్య
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాల వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. హెచ్-1బీ వీసా పథకాన్ని ఆయన సమర్ధిస్తూ కొన్ని రంగాలలో నైపుణ్యం కలిగిన వారి అవసరం దేశానికి ఉన్నదని చెప్పారు. ఫాక్స్ న్యూస్‌కు చెందిన లారా ఇన్‌గ్రహమ్‌కు ట్రంప్ మంగళవారం ఇంటర్వ్యూ ఇస్తూ నిపుణులైన వలస కార్మికుల విలువ తనకు తెలుసునని అన్నారు. చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్న అమెరికన్లకు విస్తృత శిక్షణ ఇవ్వకుండా తయారీ, రక్షణ రంగాలలో సంక్లిష్టమైన బాధ్యతలు అప్పగించలేమని తెలిపారు. ప్రభుత్వానికి హెచ్-1బీ వీసా ఆంక్షలు ప్రధానమైనవి కావా అని ప్రశ్నించగా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి నిపుణులను రప్పించుకోవాల్సిన అవసరం అమెరికాకు ఉన్నదని చెప్పారు. అమెరికన్ల వద్ద చాలినంత నైపుణ్యం లేదా అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ ‘లేదు. మనకు లేదు. కొన్ని రకాల నైపుణ్యం మన వద్ద లేదు.
దానిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది’ అని అన్నారు. విదేశీ కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యాలు…ముఖ్యంగా సాంకేతిక సంస్థలు హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని ఉపయోగిస్తుంటాయి. అయితే దీనిపై ట్రంప్ తీవ్రమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో హెచ్-1బీ వీసాలు కలిగిన వారిలో మన దేశానికి చెందిన సాంకేతిక నిపుణులు, వైద్య సిబ్బంది అధిక సంఖ్యలో ఉన్నారు. సెప్టెంబర్ నెలలో ట్రంప్ జారీ చేసిన ఆదేశాలతో వారంతా హతాశులయ్యారు. సెప్టెంబర్ 21వ తేదీ తర్వాత వచ్చే వీసా దరఖాస్తులకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత అమెరికా విదేశాంగ శాఖ కొత్త ఫీజుపై వివరణ ఇచ్చింది. సెప్టెంబర్ 21 తర్వాత హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే, హెచ్-1బీ లాటరీలో ప్రవేశించే వ్యక్తులు లేదా కంపెనీలకే కొత్త ఫీజు వర్తిస్తుందని తెలిపింది. ఆ తేదీకి ముందు వీసాలు కలిగిన వారికి లేదా దరఖాస్తు సమర్పించిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని విదేశాంగ శాఖ చెప్పింది.



