ఒకటా రెండా! ఎన్నో కేసులు!! ఇంటర్, డిగ్రీ చదువుతున్న యువతీ యువకులే కాదు.. రాష్ట్రంలో బడి పిల్లలు సైతం గంజాయికి బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రానురానూ తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారుతోంది. బడిపిల్లల నుండి వర్సిటీ స్టూడెంట్ల దాకా.. రోజు కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు… వైద్యులు, వ్యాపారవేత్తలతోపాటు సినీ ప్రముఖులు… ఇలా వాళ్లూ వీళ్లు అన్న తేడా లేకుండా ఎందరో ఈ మత్తు మహమ్మారికి బలైపోతున్నారు. నిన్నటికి నిన్న రాష్ట్ర రాజధాని నడిబోడ్డున ఓ పాఠశాలలోనే అల్ప్రాజోలం తయారు చేస్తున్న ముఠా ఉదంతం బయటపడింది. పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామంటున్నా, ఎంత నిర్బంధం విధిస్తున్నా.. వాళ్ల ఎత్తులను చిత్తుచేస్తూ.. డ్రగ్ పెడ్లర్స్ మరింత రెచ్చిపోతున్నారు. తెలంగాణలో మత్తులో జోగుతున్న వారు 29 లక్షల మంది అని ‘సామాజిక న్యాయం, సాధికారిత’ పై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక చెబుతోంది. అప్పుడెప్పుడో 2016లో పంజాబ్‌లో మాదకద్రవ్యాల వినియో గం పెరిగిపోతోందన్న కథాంశంతో వచ్చిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమా నేటి మన రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతోందంటే అతిశయోక్తి కాదేమో!
ఓల్డ్ బోయినపల్లిలోని మేధా హైస్కూల్‌లో విద్యార్థుల తరగతి గదుల పక్కనే.. ఎవరికీ అనుమానం రాకుండా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఈగల్ టీమ్ గుర్తించింది. అదే స్కూల్‌లో మత్తు మాత్రలు, ఇతర హానికారక రసాయనాలు దొరకడం విస్తుగోల్పుతోంది. విద్యాశాఖ ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. మరి ఆ విద్యార్థుల పరిస్థితేంటి? ఇప్పటికే హైస్కూలులో చదువుకునే అన్నెం పున్నెం ఎరుగని అమా యక ఆడపిల్లలకు గంజాయి అలవాటు చేసి, తర్వాత వారిని డ్రగ్స్‌కు బానిసలుగా చేసి, వారితో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఘోరాలు..దారుణాలు బయటపడుతుంటే…తాజాగా ఏకంగా బడిలోనే డ్రగ్స్ తయారుచేస్తున్న ఘటన తల్లిదండ్రుల్లో భయందోళనలను రెట్టింపు చేస్తుంది. ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో తెలియని ఆయోమయ స్థితిలోకి నెట్టివేయబడుతున్నారు. మొన్నటికి మొన్న ”కల్తీ కల్లు” ఘటన ఎందరో ప్రా ణాలు బలితీసుకుంది. ఆ కల్తీ కల్లులో వాడే ” అల్ప్రాజోలం” అనే మత్తు ఈ బడిలోనే బయటపడింది. కల్తీకల్లు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి ఉంటే ఆరోజే ఈ ఉదంతం బయటపడి ఉండేది. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన ఈగల్, నార్కొటిక్ సంస్థలు ఏంచేస్తున్నాయి.
మధ్యతరగతి ప్రజానీకమే లక్ష్యంగా పోలీసుల కన్నుగప్పి, అంతరపంటగా గంజాయిని సాగు చేయడం, దాన్ని యువతరానికి అలవాటు చేసి, ఆ తర్వాత ఖరీదైన మత్తు మందులకు బానిసలను చేస్తున్నారు. పక్కాప్లాన్ ప్రకారం యువకులకు, చిన్నారులకు నిదానంగా ఈ మత్తుకు అలవాటు చేస్తున్నారు. ఆ ప్రణాళికలో భాగంగా.. తొలుత నిఘా తక్కువగా ఉండే ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు గంజాయితో చేసిన చాక్లెట్లను, కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు.. సిగరెట్లను తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాద్ శివార్లలో ఏకంగా రసాయనాల తయారీ ముసుగులో మాదకద్రవ్యాల తయారీయే గుట్టుగా సాగిపోతోందన్నది వాస్తవం. కేంద్రంలో బీజేపీ పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టులను, ఎయిర్ పోర్టులను ప్రయివేటుకు ధారాదత్తం చేశాక.. అందులో పనిచేసే అధికారులు వారి తొత్తులయ్యాక… ఇలాంటి పరిస్థితులను అడ్డుకునేదెవరు? ఆదానీకి చెందిన ముంద్రాపోర్టులో రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డ తీరే నిదర్శనం. విద్యావ్యవస్థలో లోపాలు, విద్యార్థులపై ఒత్తిడి, క్షీణిస్తున్న సామాజిక విలువల ఫలితంగానే భావితరం దారి తప్పుతున్నది.
చెడు లక్షణాలేవి ఒక్కసారితో అబ్బవు. కుటుంబ సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, పేదరికం పరిష్కరించుకోలేక వీటికి బానిసలవుతున్నారు. కేవలం సంఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం మేల్కంటున్న తీరు సమాజానికి సిగ్గుచేటు. ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? యువతకు ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవు తున్న ప్రభుత్వాలు వారు ”మత్తు”లో తూలడమే మేలనుకుం టున్నాయా? దీనికి తోడు మతోన్మాదం, కులోన్మాదమూ మత్తును మరింత దట్టిస్తోంది. అప్రజాస్వామిక విధానాలను, వైఫల్యాలను ప్రశ్నించకుండా ”మత్తు”లో జోకొడుతోంది. డ్రగ్స్‌ను అరికట్టే విషయంలో రాజకీయాలను, స్వప్రయోజనాలను పక్కనబెట్టి కార్యాచరణకు నడుం బిగించినప్పుడే ఫలితం సిద్ధిస్తుంది. తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను బలోపేతం చేసి, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడతామనడం మంచిదే. కానీ, ఇవి కేవలం మాటలకే పరిమితమయితే… మత్తులో చిత్తు అయిన ‘యువత’తో రాష్ట్రం నిర్వీర్యమైపోయే ప్రమాదం పొంచి ఉంది… తస్మాత్ జాగ్రత్త!
ఉడ్తా తెలంగాణ కారాదు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES