నిజమే! గతవారం రోజులుగా ఉక్రెయిన్ పోరులో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పశ్చిమదేశాల నుంచి వస్తున్న వార్తలను చూస్తుంటే భయంకరంగా కనిపిస్తున్నాయి. చలికాలం ముగిసేలోగా ఉక్రెయిన్ పతనమవుతుందా? చలికి తట్టుకోలేక ఉక్రెయిన్ సైన్యం తెల్లజెండా ఎత్తుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య మంగళవారం 1,363వ రోజులోకి ప్రవేశించింది. వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపో తున్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడు వ్లదిమిర్ జెలెన్‌స్కీ విదేశాలకు పారిపోనున్నాడా? అంటే మిన్నువిరిగి మీద పడే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అందుకు అవకాశాలు లేకపోలేదని అనిపిస్తున్నది. గత కొద్ది వారాలుగా అనేక కీలక ప్రాంతాలను చక్రబంధంలో బిగించిన రష్యా ఒక్కో గ్రామం, ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. పోకరోవస్క్ అనే పట్టణంలోకి పుతిన్ సేనలు చొరబడ్డాయని ఏక్షణంలోనైనా స్వాధీనం చేసుకోవచ్చని వార్తలు. గత ఏడాదిన్నర కాలంగా ఆ పట్టణాన్ని పట్టుకొనేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ ఉన్న దాదాపు ఐదువేల మంది ఉక్రెయిన్ మిలిటరీ కదలకుండా బందీ అయిందని, తెల్లజెండా ఊపిందని, పోరు సాగుతున్నదని భిన్నవార్తలు. వెలుపలి నుంచి వస్తున్న రష్యన్ సేనలను ప్రతిఘటిస్తున్నట్లు కనిపించటం లేదని, అయితే ఇండ్లు, బంకర్లలో ఉన్నవారి కారణంగా ఒక్కో ప్రాంతాన్ని జల్లెడ పట్టి ముందుకు పోతున్నారని చెబుతున్నారు.కొన్ని వారాల్లో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవచ్చని సమాచారం. అది స్వాధీనమైతే అనేక కొత్త ప్రాంతాలను సులభంగా పట్టుకొనేందుకు వీలుకలుగుతుందని, సైనిక చర్య మరో మలుపు తిరుగుతుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జరిపే పెద్ద దాడులకు సన్నాహాల్లో భాగంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న పోలాండ్‌లోని రైల్వేట్రాక్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. సోమవారం నాడు పోలాండ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఐరోపా దేశాల మీడియా రష్యా కారణమని చెబుతున్నది. ఇదే సమయంలో తాము ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నట్టు శుక్రవారం నాడు జెలెన్‌స్కీ కూడా అంగీకరించాడు. నాటో కూటమి దేశాలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నప్పటికీ అది వృధా అనే అభిప్రాయంతో నేతలున్నారు. ఉక్రెయిన్ ఇజ్‌మెయిల్ రేవు పట్టణం వద్ద ఉన్న టర్కీ ఎల్‌పిజి టాంకర్ షిప్‌పై జరిగినదాడిలో అది దగ్ధమైంది.దాడి ఎవరు జరిపిందీ తేలనప్పటికీ రష్యా చేసిందని ఆరోపించారు. దాంతో పక్కనే ఉన్న రుమేనియాతన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. ప్రత్యక్షంగా పాల్గ్గొనేందుకు నాటో నేతలు విముఖత చూపుతున్నారు. గతంలో తగిలిన దెబ్బలతో తలబొప్పి కట్టిన డోనాల్డ్ ట్రంప్ నుంచి ఉక్రెయిన్ సమస్యపై ప్రస్తుతం కంటి చూపున్న నోటమాట లేదు. జెలెన్‌స్కీ పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా ఉంది.
దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిఝఝియాలో మరికొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలోకి వెళ్లాయి.ఈ ప్రాంతంలో పోరు దిగజారుతున్నదని జెలెన్‌స్కీ మిలిటరీ అధికారులే అంగీకరించారు. వ్యూహాత్మకంగా తమసేనలను వెనక్కు రప్పిస్తున్నట్లు చెప్పుకున్నారు.హంగరీ ప్రధాని విక్టర్ ఒర్బాన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ గెలిచే అవకాశం లేదని, ఐరోపా ఆర్థికసాయం పిచ్చితనం తప్ప మరొకటి కాదన్నాడు. ఇప్పటికే 185బిలియన్ యూరోలు తగలేశామని, ఇంకా అంతకంటే ఎక్కువే తగేలేయాలని చూస్తున్నామని, ఎంత చేసినా గెలిచే అవకాశం లేదని జర్మన్ మీడియా గ్రూపు అక్సెల్ స్ప్రింగర్ సిఇఓతో మాట్లాడుతూ చెప్పాడు. యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణుల కోసం జెలెన్‌స్కీ ప్రస్తుతం ఫ్రాన్సు పర్య టనలో ఉన్నాడు. రానున్న పదేండ్లలో 100 రాఫేల్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలొచ్చాయి. తర్వాత స్పెయిన్ వెళతాడని సమాచారం. సరస్సులోని చేపలు పైకి వస్తే మింగివేసేందుకు సిద్ధంగా ఉండే కొంగల మాదిరి క్రామాటోరస్క్ వంటి చోట్ల రష్యన్ లాన్సెట్ డ్రోన్లు దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఉక్రెయిన్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రతి రోజూ రష్యన్ల చేతిలో నరకం చూస్తున్నట్టు చెబుతున్నారు. సమీప భవిష్యత్‌లో రష్యాతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ జరిగే అవకాశం లేదని మాస్కోతో 1,350 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఫిన్లండ్ అధ్య క్షుడు అలెగ్జాండర్ స్టబ్ చెప్పాడు. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి తాను ట్రంప్‌తో మాట్లాడతానని, పది అంశాల్లో ఏ ఒక్కదానికి పుతిన్ అంగీకరించినా మంచిదే అన్నాడు. ఇటీవలనే ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. రష్యా ఎత్తుగడలు ఏమిటో తమకు బాగా తెలుసని స్టబ్ చెప్పాడు.
ఉక్రెయిన్ సేనలు యుద్ధ రంగం నుంచి పారిపోతున్న వార్తలు గతంలోనే వచ్చిన ప్పటికీ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉన్నాయి. వివాదం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు చూస్తే పశ్చిమ దేశాల మీడియా వార్తల ప్రకారం అక్టోబరు నెలలో 21వేల మంది పారిపోయారు. రష్యాపై తాము విజయం సాధించబోతున్నామని జెలెన్‌స్కీ ఎన్ని కబుర్లు చెప్పినా, ఇతర దేశాలు ఇచ్చిన కొన్ని ఆధునిక ఆయుధాలు, సమాచారం ఆధారంగా రష్యాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసిన తర్వాత ఇలా జరగటం, అదీ పశ్చిమ దేశాల మీడియా వెల్లడించట గమనించాల్సిన అంశం. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని ఇటీవలి వరకు ఉక్రెయిన్ మిలిటరీలో పనిచేసిన ఇగోర్ లుస్టెంకో చెబుతున్నాడు. మిలిటరీ ఇలాంటి అంశాలను బయటకు రాకుండా చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.అధికారిక సమాచారం ప్రకారమే అక్టోబరులో 21,602 మంది పారిపోయారు, వాస్తవంలో ఎక్కువ మంది ఉంటారని లుస్టెంకో చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఇటీవలి కాలంలో రష్యన్ సేనలు మరిన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతుండగా, తాము గెలిచే అవకాశం లేదని ఉక్రెనియన్లు భావించటంతో పోరాడటం, ప్రాణాలు పోగొట్టుకోవటంలో అర్థంలేదని అనేక మంది భావిస్తున్నట్లు వార్తలు.
ఇటీవల ఒక బ్రిటీష్ పత్రిక చేసిన విశ్లేషణ ప్రకారం ఆరున్నర లక్షల మంది మిలిటరీలో చేరి పోరాడగలిగిన వయస్సున్నవారు ఉక్రెయిన్ వదలి పారిపోయారు. ఆ దేశ పార్లమెంటు సభ్యుడొకరు నాలుగు లక్షలని చెప్పాడు.మిలిటరీ నుంచి పారిపోతున్నవారి గురించి 2024డిసెంబరులో ఫైనాన్సియల్ టైమ్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం అంతకు ముందు రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆ ఏడాది రెండింతలున్నారు.బ్రిటీష్ పత్రిక టెలిగ్రాఫ్ ఇటీవల ఇచ్చిన విశ్లేషణ ప్రకారం ప్రతినెలా పారిపోతున్న లేదా విధులకు చెప్పకుండా గైరుహాజరవు తున్నవారి సంఖ్య ఇరవైవేలు ఉంటున్నది. పారిపోయిన వారి మీద 2.9లక్షల కేసులను ప్రభుత్వం నమోదు చేసింది.ఇప్పుడు కనీసం రెండు లక్షల మంది కొరత వున్నట్లు అంచనా. అనేక మంది మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ విషయాలను రాసింది. పోరు జరుగుతున్న ప్రాంతాలలో ఉన్నవారిలో కేవలం 30శాతం మందే యుద్ధ సన్నద్దతతో ఉన్నారు. సెప్టెంబరు నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ సేనలలో కేవలం 47-48శాతానికి మించి లేరని చెప్పాడు. సైనికుల కొరత ఉన్నవారి మీద వత్తిడిని కూడా పెంచుతున్నది.వారినే ఒక రంగం నుంచి మరో రంగానికి పదే పదే మారుస్తున్నారు. నిరంతర దాడులను తట్టుకొనే శక్తి తగ్గుతున్నదని ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు వాపోతున్నారు. కొత్తగా సైన్యంలోకి తీసుకున్నవారికి కూడా తగిన శిక్షణ ఇవ్వకుండా యుద్ధరంగానికి తరలిస్తున్నారు.గ్రామాల నుంచి మిలిటరీలోకి తీసుకున్నవారిలో కొందరికి కేవలం రెండు రోజులు మాత్రమే శిక్షణ ఇచ్చి యుద్ధ రంగానికి పంపుతున్నట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొన్నది. యుద్ధం జరిగిన సమయాల్లో ఏ పక్షమైనా తమకు జరిగిన నష్టాన్ని మూసిపెడుతుంది.వర్తమాన పోరులో రష్యా, ఉక్రెయిన్ గురించి కూడా అలాంటి వార్తలే వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో వెల్లడైనట్లు చెబుతున్న ఒక పత్రం ప్రకారం 17లక్షల మంది ఉక్రెనియన్ సైనికులు మరణించారన్నది అతిశయోక్తితో కూడినదిగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఉంటారన్నది వాస్తవం. మిలిటరీ నుంచి పారిపోవటం పెరగటానికి ఇవి కూడా కారణం.
అనేక చోట్ల ఉక్రెయిన్ సేనల లొంగుబాటు, రష్యా ఆధీనంలోకి పలు ప్రాంతాలు పోతున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో జెలెన్‌స్కీ బ్రిటన్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్ గగనతలంపై విమానాలు ఎగరటం ప్రమాదకరంగా ఉండటంతో పక్కనే పోలాండ్‌లో విమానాన్ని సిద్ధంగా ఉంచుకున్నట్లు వార్తలొచ్చాయి. జెలెన్‌స్కీ ఏ ఐరోపా దేశానికి వెళుతున్నా కూడా చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. భద్రతా కారణాల రీత్యా తమదేశ పర్యటన గురించి వివరాలను వెల్లడించలేమని స్పెయిన్ ప్రధాని కార్యాలయం పేర్కొన్నట్లు రేడియో వెల్లడించింది. అయితే జెలెన్‌స్కీ సోమవారం నాడు ఫ్రాన్సు వెళ్లాడు. మరో వైపున అతగాడి స్థానంలో ఎవరిని గద్దెనెక్కించాలా అని ఆరునెలలుగా డోనాల్డ్ ట్రంప్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇంథన ఒప్పందాలలో జెలెన్‌స్కీ కి పది కోట్ల డాలర్ల లంచం ముట్టినట్లు, దాని గురించి దర్యాప్తు జరుగుతున్నదనే వార్తలు వచ్చాయి. అనేక దేశాల్లో ఎవరినైనా సాగనంపాలనుకున్నపుడు ఇలాంటి వాటిని ముందుకు తెచ్చి రంగం సిద్ధం చేసే సంగతి తెలిసిందే. జెలెన్‌స్కీ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు రష్యన్ వర్గాలు కూడా చెబుతున్నాయి. బ్రిటన్ ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడ ఎంతకాలం ఉంటారన్న విశ్లేషణ కూడా సాగుతున్నది. ఇప్పటికే బ్రిటన్‌లో భవనాలను కొనుగోలు చేశాడని, రాజు చార్లెస్‌తో సంబంధాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల నాటికి డెమోక్రటిక్ పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేసేందుకు గాను దాఖలు చేసే కేసులలో జెలెన్‌స్కీని సాక్షిగా చేసేందుకు చూస్తున్నట్లు, దానికి గాను పారిపోతే బ్రిటన్ నుంచి రప్పిస్తారని కూడా చెబుతున్నారు.మరొక దేశం ఇజ్రాయిల్ వెళ్లినా అదే జరుగుతుంది.
కీలకమైన పోకరోవస్క్ పట్టణం పతనమైన తర్వాత ఇలాంటి పరిణామం జరుగవచ్చని భావిస్తున్నారు. జెలెన్‌స్కీ పర్సుగా పరిగణిస్తున్న ఒక టీవీ కార్యక్రమాల స్టూడియో యజమాని తైముర్ మిం డిచ్ మీద ఇప్పుడు జాతీయ అవినీతి నిరోధకశాఖ దర్యాప్తు జరుపుతున్నది. మాజీ ఉప ప్రధాని, ప్రస్తుతం జాతీయ ఐక్యత శాఖ మంత్రిగా ఉన్న ఒలెక్సీ గురించి కూడా దర్యాప్తు జరుగుతున్నది. జెలెన్‌స్కీ పదవీ కాలం ముగిసింది. పోరు సాగుతు న్నదనే పేరుతో పదవిలో కొనసాగుతున్నాడు, ఉక్రెయిన్‌కు తగులుతున్న ఎదురుదెబ్బల పూర్వరంగంలో అతగాడిని బలి పశువుగా చేసి కొత్తబొమ్మను అధికారాన్ని ఎక్కించి కాలం గడిపేందుకు అమెరికా, ఇతర నాటో దేశాలు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. అక్కడ ఎవరు గద్దెనెక్కినా రష్యాకు వ్యతిరేకంగా నాటో దేశాల కుట్రలకు తెరపడితే తప్ప ప్రయోజనం ఉండదు!
ఎం కోటేశ్వరరావు
8331013288
పతనదిశగా ఉక్రెయిన్ – పరారీక్రమంలో జెలెన్‌స్కీ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



