- Advertisement -
- – విధానాలు మార్చుకోకపోతే బీజేపీ గద్దెదింపుతాం అన్నమొల్ల కిరణ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
- – సమ్మె జయప్రదం చేసిన కార్మిక, కర్షకులు
- నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
- కేంద్రంలో కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని బీజేపీ పాలనలో నిరుద్యోగం పేదరికం పెరిగిపోయిందని అన్నమొల్ల కిరణ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా సవరణలు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకువచ్చిందని అన్నారు. కేంద్రం విధానాలు మార్చుకోకపోతే బీజేపీని గద్దె దింపుతామని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం సమ్మె చేపట్టారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. వర్షం పడుతున్న లెక్కచేయకుండా నిరసన తెలిపి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
- కార్మిక ద్రోహానికి పాల్పడుతున్న కేంద్రం
- ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే కార్మికులు కర్షకులు ప్రజల్ని కూడగట్టి గద్దెదింపుతామని హెచ్చరించారు. దేశ కార్మిక వర్గం సాధించుకున్న హక్కులు చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక ద్రోహానికి పాల్పడింది. మరోవైపు ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో వాటాలను విక్రయిస్తూ కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రైవేటీకరణను మరింత వేగవంతం చేసిందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను దూరం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును దూరం చేసి, 12 గంటల పని దినాన్ని చట్టబద్ధం చేసి కార్మికుల శ్రమను కార్పొరేట్లు దోచుకునేందుకు చట్టాలలో మార్పులు చేసిందన్నారు. రైతాంగం మద్దతు ధరల చట్టం కోసం పోరాటాలు నిర్వహిస్తున్నా ఏంఎస్పి చట్టాన్ని చేయడంలేదని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎన్. హెచ్.ఎం ఐసీడీఎస్, ఏండీ. ఎంఎస్ లాంటి స్కీమ్ లకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను రాజీలేని ఉదృత పోరాటాల ద్వారా తిప్పి కొట్టాలని హక్కుల సాధనకు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కదలాలని విధానాల్లో మార్పురాకపోతే బీజేపీ ని ఐక్యంగా గద్దెదించాలని కార్మికులకు కర్షకులకు ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్నీ మండల కేంద్రాల్లో సమ్మెను జయప్రదం చేసిన కార్మికవర్గంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వర్షం లోను సమ్మె జయప్రదం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, టీయూసిఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జె.దళిత్, బీ జగన్ సింగ్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బీ.వెంకట్ నారాయణ, ఐఎన్.టీయూసీ జిల్లా నాయకులు షైక్ ఫహీమ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, ఎస్.నవీన్ కుమార్, ఏం.సుజాత, ఏం.భీంరావు ఆశన్న, దర్శనాల నగేష్, మంజుల, ఆశన్న పాల్గొన్నారు.
- Advertisement -