నవతెలంగాణ – మిర్యాలగూడ
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మితో కలిసి మిర్యాలగూడ డివిజన్లోని దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడడమే కాకుండా, ఓటు వేసేందుకు గుర్తింపుగా తీసుకువచ్చిన గుర్తింపు కార్డుల గురించి జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలోని ఒక పోలింగ్ బూతు లో పోలింగ్ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ పరిమితికి మించి ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఉండడం పట్ల ప్రిసైడింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ప్రిసైడింగ్ అధికారి ,స్కూల్ అసిస్టెంట్ సంధ్య కు షోకాజ్ నోటీస్ జారిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రతిరోజూ టేలికాన్ఫెరెన్సు తో పాటు, శిక్షణ ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని ఆర్ ఓలు అత్యవసరమై బయటికి వెళ్ళవలసి వస్తే తప్పనిసరిగా ఒక గజిటెడ్ ఆఫీసర్ కు స్టాచ్యూటరీ మెటీరియల్ అప్పగించి వెళ్ళాలని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుండి పోలైన బాలెట్స్ తో పాటు, ఎన్నికల సామాగ్రి వచ్చిన తర్వాత దగ్గరలోని ఎస్టిఓలో భద్రపరిచే బాధ్యత ఎంపీడీవోదని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డిపిఓ వెంకయ్య ,దామరచర్ల ప్రత్యేక అధికారి, డిసిఓ పత్యా నాయక్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రమేష్ ,తదితరులు ఉన్నారు.



