న్యాయ చిక్కుల్లో దేవాదాయ భూములు
అన్యాక్రాంత భూముల్లో బడాబాబుల హస్తం
కౌంటర్లు దాఖలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం
దృష్టిసారించిన మంత్రి కొండా సురేఖ
దేవాదాయ భూములే కదా? భూమిలేని పేదలు దున్నుకుని బతుకుతారు. వారికి అవే జీవనాధారం. ధూపదీప నైవేద్యానికి పంట పంటకు ఇంతిస్తే చాలు అనే రోజులు పోయాయి. కొన్ని దశాబ్దాల కిందట పాతిన సరిహద్దులు చెరిపేస్తున్నారు. హద్దురాళ్లు విసిరేస్తున్నారు. ఆధారాలను మాయం చేసి మట్టిలో కలిపేస్తున్నారు. మొత్తంగా ఆ భూములను పట్టా భూముల్లో కలిపేస్తు న్నారు. రాష్ట్రంలో లక్ష ఎకరాలకుపైగా దేవాదాయ భూములు ఉన్నాయి. అవి క్రమంగా వందల ఎకరాల్లోకి చేరుకున్నాయి.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేవాదాయ భూములంటేనే తెగని పంచాయితీ.. తెంపని పాలకులు అన్న విధంగా తయారైంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్యాక్రాంతమైన భూములను రక్షిస్తామంటూ చెప్పడం అలవాటుగా మారింది. కానీ ఆచరణలో మాత్రం పాలకులు అందుకు పూనుకోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ చొరవ తీసుకుని న్యాయ చిక్కుల్లో ఉన్న కొన్ని భూ సమస్యలపై దృష్టి పెట్టినా…ప్రభుత్వ న్యాయవాదులు, ఉన్నతాధికారులు కౌంటర్లు వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో కోర్టుకు హాజరుకాక పోవడం, సరైన ఆధారాలు సమర్పించక పోవడం, వెనువెంటనే ప్రతివాదులను ఎదుర్కొనేందుకు కౌంటర్లను దాఖలు చేయకపోవడం వంటి చేష్టలతో ఆ భూములు ఇంకా న్యాయ వివాదాల్లో మగ్గుతున్నాయి.
న్యాయ వివాదాల నుంచి 560 ఎకరాల భూమి విముక్తి
ఇటీవల కాలంలో మొత్తం 1,817 ఎకరాల భూములను వివిధ థార్మిక సంస్థల ఆధీనంలోకి తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ భూముల రక్షణ కోసం హోర్డింగులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. తాజాగా మరో 560.23 ఎకరాల భూమి న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొని విముక్తి చెందింది. ఆ భూముల్లో రెవెన్యూ, సర్వే శాఖల సహకారంతో సర్వే నిర్వహించింది. వాటికి సరిహద్దులు నిర్ణయించి, ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధమవుతున్నది. దేవాలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది. వ్యవసాయానికి ఉపయోగపడని ఖాళీ భూములను ఆదాయ వనరులుగా మార్చేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా 231.05 ఎకరాల దేవాదాయ భూమిని ఐదు జిల్లాల్లో గుర్తించి, వాటిని మహిళల స్వయం సహాయక సంఘాలకు లీజుకు ఇవ్వడం ద్వారా తెలంగాణ గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దేవాదాయ భూములకు జియో-ట్యాగింగ్
దేవాదాయ భూముల డిజిటలైజేషన్, రక్షణే లక్ష్యంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ (టీజీఆర్‌ఏసీ) సహకారంతో జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్మెషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారిత మ్యాపింగ్, ఇన్వెంటరీ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటి వరకు మొత్తం 34,092 ఎకరాల దేవాదాయ భూములను జియో-ట్యాగ్ చేశారు. మరో 91,827.35 ఎకరాలమేర గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను రక్షించేందుకు బాధితులను ఏ విధంగా శిక్షించాలి. ఏయే సెక్షన్లు ఉండాలనే విషయంలో దేవాదాయ శాఖ మేధోమధనం చేస్తోంది. ఇందుకు సంబంధించి 2002 నుంచి 2025 వరకు 1,500 కేసులు పెండింగులో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు 543 కోర్టు కేసులను డిస్పోజ్ చేసినట్టు ఆ శాఖకు నివేదిక ఇచ్చింది. దేవాదాయ శాఖకు సంబంధించిన కేసుల్లో రిట్ వేసిన దగ్గరి నుంచి కేసు పూర్తయ్యేవరకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై సర్కారు ఫోకస్ చేసింది. ఈ విషయంలో ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై అవసరమైతే ఆర్కియాలజీ డిపార్టుమెంట్ నుంచి వివరాలు సేకరించేందుకు ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఒక నిపుణుల కమిటీని నియమించాలని భావిస్తోంది. దేవాదాయ భూములను కాపాడేందుకు ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆ శాఖ యోచిస్తున్నది.
వామపక్షాల పోరాటాలు
ఆ భూముల నుంచి సన్న, చిన్నకారు రైతులను బయటకు పంపించి…బడాబాబులు వాటిపైకి వచ్చి చేరుతున్నారు. చాలా వరకు దేవాదాయ భూములను రియల్ ఎస్టేట్ అడ్డాలుగా మారుస్తున్నారు. ఈ భూముల రక్షణ కోసం వామపక్షాలు దశాబ్ద కాలంగా అనేక ఉద్యమాలు చేస్తూ వస్తున్నాయి. వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ భూములు పేదలకు దక్కకుండా పోతున్నాయి. ఈ క్రమంలో దేవాదాయ భూములు చాలా కాలంగా న్యాయ చిక్కుల్లో చిక్కుకున్నాయి. ఆ భూములను విముక్తి చేయడం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. చివరకు ప్రభుత్వ అవసరాలకు కూడా భూములు దక్కని పరిస్థితులున్నాయి. అంతేకాకుండా వాటి నుంచి తగిన ఆదాయం రాకపోవడంతో దేవాలయాల ధూపదీప నైవేద్యానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాయి.



