మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా క్లీన్‌స్వీప్ చేస్తాం : బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగమయ్యాయని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాల్టీలను నిర్వీర్యం చేస్తోందనీ, అభివృధ్ధిని గాలికి వదిలేసిందని విమర్శించారు. నిధుల్లేక అభివృద్ధి పడకేసిందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అమలు కాని హామీలతో విసిగిపోయిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసం వద్ద సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నాయకులు లాడ్ బాలు యాదవ్, శేఖర్, పాండు, రాజు, శేఖర్, దశరథ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, పాండు, వెంకట్‌రెడ్డి, కుమార్ భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి హరీశ్‌రావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చాక మున్సిపాల్టీల అభివృద్ధికి ఒక్క రూపాయి విడుదల చేయడం లేదన్నారు.
బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, చెత్త ఎత్తడానికి కూడా నిధుల్లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కొరతతో పట్టణాల్లో పారిశుధ్యం లోపించిందని చెప్పారు. దోమల బెడద పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని విమర్శించారు. వీధి లైట్లు వెలిగే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ 420 హామీలిచ్చిందని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలు, యువత, రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. మున్సిపాల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలను చైతన్యపర్చాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పటాన్‌చెరు బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జీ ఆదర్శ్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



