మాజీ న్యాయమూర్తి రంజన్ దేశారు నేతృత్వంలో ముగ్గురితో కమిటీ
18 నెలల్లో కేంద్రానికి సిఫారసులు
1.19 కోట్ల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు లబ్ది
2025-26 రబీ సీజన్‌లో రూ.37,952 కోట్ల సబ్సిడీకి ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పింఛనర్ల జీతాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8వ వేతన సంఘానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రబీ సీజన్ 2025-26కు గానూ ఎరువులపై రూ.37, 952 కోట్ల సబ్సిడీకి గ్రీన్ సిగల్ ఇచ్చింది. మంగళవారం నాడిక్కడ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం రెండు అంశాలపై నిర్ణయం తీసుకుంది. అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్‌ఎంసీ)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. 8వ వేతన సంఘం (పే కమిషన్) నిబంధనలకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, ఒక సభ్యుడు (పార్ట్ టైమ్), ఒక సభ్య-కార్యదర్శి ఉంటారు.
8వ వేతన సంఘం చైర్మెన్‌గా రిటైర్డ్ జడ్జీ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశారు, పార్ట్ టైమ్ సభ్యుడిగా ప్రొఫెసర్ పులక్ ఘోష్, సభ్య కార్యదర్శిగా పంకజ్ జైన్‌ను నియమించినట్టు చెప్పారు. 18 నెలల్లోపు కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫారసులు చేస్తుందన్నారు. కేంద్ర పరిధిలోని 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనర్లకు లబ్ది చేకూరనున్నట్టు వెల్లడించారు. కాగా… ప్రస్తుత ఏడో వేతన సవరణ సంఘం కాల పరిమితి వచ్చే ఏడాదితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త వేతన సవరణ అమలుకై 2025 జనవరిలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు, మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తత స్థాయి సమీక్షలు నిర్వహించింది. అనంతరం ముగ్గురు సభ్యులతో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చేసే సిఫారసుల ఆధారంగా కేంద్ర ఉద్యోగులు, పింఛనర్ల జీతాలు, పింఛన్లను కేంద్రం సవరించనుంది.
రబీ సీజన్‌లో ఎరువులపై సబ్సిడీకి ఆమోదం
2025-26 రబీ సీజన్ (అక్టోబర్ 2025 మార్చి 2026) కోసం ఫాస్పరస్, పోటాషియం (పి అండ్ కె) ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్ బిసి) రేట్లను నిర్ణయించడానికి ఎరువుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇందుకోసం రూ.37,952.29 కోట్లు కేటాయించింది. న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ పేరుతో నైట్రోజన్, ఫాస్పరస్, పొటాష్, సల్ఫర్లకు కేంద్రం సబ్సిడీ అందించనుంది. నైట్రోజన్‌పై కిలోకు రూ.43.02, ఫాస్పర్ట్ పై కిలోకు రూ. 47.96, పొటాష్‌పై కిలోకు రూ. 2.38, సల్ఫర్‌పై కిలోకు రూ 2.87 సబ్సిడీ కల్పిస్తున్నట్టు వెల్లడించింది.
రబీ సీజన్‌లో డై అల్యూమినియం ఫాస్పేట్ (డిఎపి), మోనో అల్యూమినియం ఫాస్పేట్ (ఎంఎపి), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఒపి), ట్రిపుల్ సూపర్ ఫాస్పేట్ (టిఎస్ పి), 3 గ్రేడ్స్ ఆఫ్ సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్‌ఎస్ పి), పొటాష్ డెరైవ్‌డ్ మొలాసెస్ (పిడిఎం), అల్యూమినియం సల్ఫేట్ (ఎఎస్) వంటి దాదాపు 28 ఎన్పీకెఎస్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలకు న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ అమలు చేయాలని నిర్ణయించింది.



