నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 46వేల మంది చిన్నారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. మంత్రుల పంచాయితీ ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పరిస్థితులను పార్టీ హైకమాండ్ గమనిస్తోందన్నారు.
కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మహేశ్‌కుమార్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. తొలి నుంచి పార్టీకి సేవచేసిన కుటుంబాలకు అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన సహకారం లేదని ఆయన ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఆ తర్వాత అందరూ కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డంకులు పెడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10 ఏళ్లు భారత రాష్ట్రసమితి అభ్యర్థులే గెలిచారని, మరి ఓట్ చోరీ ఎవరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తొలుత ఫిర్యాదు చేసింది సీఎం రేవంత్‌రెడ్డే అని గుర్తు చేశారు. అధికారులు, మంత్రులు ఎవరైనా జవాబుదారీగా ఉండాలని సూచించారు.



