– కనీస వేతనాలు సవరించని రాష్ట్ర ప్రభుత్వం
– లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు పోరాటం
– డిసెంబర్ 31 నుంచి సీఐటీయూ జాతీయ మహాసభలు : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-ఉమ్మడి మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కార్మికుల సమస్యలపై అన్ని ట్రేడ్ యూనియన్‌లను కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. మెదక్‌లో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల ప్రారంభ సభ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదలుకొని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం.. కార్మికుల కనీస వేతన జీవోను ఇప్పటివరకు సవరించలేదని విమర్శించారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు కోటీ 50 లక్షల మంది ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కోరలు లేని నాలుగు లేబర్ కోడ్స్‌ను అమలులోకి తెచ్చిందన్నారు. శ్రమ శక్తి నీతి 2025 పేరుతో కొత్త లేబర్ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం, విద్యుత్ సవరణ బిల్లు, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వే, రోడ్డు రవాణా తదితర రంగాల్లో కార్మిక వ్యతిరేక సంస్కరణలు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సంస్థలను ఏడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలతో ప్రభుత్వ రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కార్మికులకు కనీస వేతనాలను సవరించలేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టేందుకు ఈ మహాసభలో తగిన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని తెలిపారు. యూనియన్లకు అతీతంగా గ్రామ స్థాయిలోని కార్మిక వర్గాన్ని భాగస్వాములను చేద్దామని, రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికుల దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం ఐక్య ఉద్యమాలను విస్తృతపరచాలని సీఐటీయూ 5వ మహాసభ తీర్మానం చేసిందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సీఐటీయూ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్, జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలపై ఐక్య ఉద్యమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



