– యుద్ధ సమయంలో ఇరాన్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపర్చే యత్నాలు
– ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ను అమెరికా తన విధేయమైన దేశంగా మలుచుకోవాలనుకుం టున్నదని అన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను లొంగదీసుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడం కోసం యునైటెడ్ నేషనల్ ఫ్రంట్‌కు ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్, అమెరికాతో యుద్ధ సమయంలో ఇరాన్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపర్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఖమేనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురితమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఆగిపోయిన తర్వాత.. ప్రపంచదేశాలతో తన అణుకార్యక్రమం గురించి ఇరాన్ చర్చిస్తున్న తరుణంలో ఖమేనీ నుంచి ఈ వ్యాఖ్యలు రావటం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా జరిపిన దాడులు ఇస్లామిక్ రిపబ్లిక్‌ను అస్థిరపర్చడానికి రూపొందించబడ్డాయని ఖమేనీ వాదించారు. యుద్ధం ప్రారంభంలో ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి తర్వాత అమెరికా ఏజెంట్లు యూరప్‌లో సమావేశమయ్యారనీ, ఇస్లామిక్ రిపబ్లిక్ తర్వాత ఇరాన్‌ను ఎవరు పరిపాలించాలన్నదానిపై అందులో చర్చ జరిగినట్టు ఆయన చెప్పారు. మొత్తానికి యూఎస్.. ఇరాన్‌ను తాను చెప్పినట్టుగా చేసేలా మార్చుకోవాలని చూస్తున్నదని ఖమేనీ అన్నారు. ఇరాన్ దేశం తమ సాయుధ బలగాలు, ప్రభుత్వం, వ్యవస్థ వైపు నిలబడి శుత్రువులకు గట్టి దెబ్బ వేసిందని చెప్పారు. అంతర్గత విభజనలకు విదేశీ శక్తులు రెచ్చగొడుతున్నాయని కూడా ఆయన హెచ్చరించారు.