Monday, October 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు

కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌

నవతెలంగాణ-చర్లపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి.. యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ అన్నారు. కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లిలోని సీఐఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఐటీయూ.. కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. సీఐటీయూ ఆలిండియా మహాసభలు డిసెంబర్‌ 31 నుంచి 2026 జనవరి 5 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరగనున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మహాసభలు మెదక్‌ పట్టణంలో డిసెంబర్‌ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాసభలు జరుగుతున్నాయని, గత మూడు సంవత్సరాల కార్యక్రమాలపై సమీక్ష జరిపి, రాబోయే మూడు సంవత్సరాల భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి కార్మిక చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు, పెట్టుబడి దారుల చేతికి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఎల్‌ఐసీ వంటి సంస్థలను అదానీ, అంబానీలకు లబ్ది చేకూరేలా వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిక్స్‌డ్‌ టర్మ్‌, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు నియామకాల ద్వారా శాశ్వత ఉద్యోగాలను తొలగించడం ద్వారా కార్మికులను భద్రత లేని పరిస్థితుల్లోకి నెట్టివేయడం జరుగుతోం దన్నారు.

జులై 9న దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి జరిగిన కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు విస్తృతమైన మద్దతు లభించిందని గుర్తుచేశారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన శ్రామిక శక్తి నీతి 2025 లేబర్‌ కోడ్లను వేగంగా అమలు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 8 నుంచి 10 గంటల పని విధానం కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం కొనసాగించడం దురదృష్టకరమన్నారు. కేవలం ఎర్రజెండా నీడలో ఉన్న వామపక్ష ప్రభుత్వం కేరళలో మాత్రమే 8 గంటల పని విధానం కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని విమర్శించారు. భద్రతా లోపాల వల్ల సిగాచి పరిశ్రమలో 48 మంది కార్మికులు మృతిచెందినా, ప్రకటించిన నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కార్మికులకు గౌరవప్రదమైన జీవనావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -