Wednesday, July 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబెజగామలో అపూర్వ సతి శిల గుర్తింపు

బెజగామలో అపూర్వ సతి శిల గుర్తింపు

- Advertisement -

నవతెలంగాణ-నంగునూరు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం బెజగామలో సతి శిల, శూలారోహణ ఆత్మాహుతి శిలతో పాటు ఇతర వీరగల్లులను గుర్తించినట్టు నంగునూరుకు చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు, తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొలిపాక శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సతి శిల ఇంతకు ముందు ఎన్నడూ కనిపించనటువంటి అరుదైన వీర స్మారక శిల అని అన్నారు. వీరుని తలమీద పెద్ద సిగ, చెవులకు జుంకాలు, మెడలో కంటె, జంధ్యం, హస్త భూషణాలు, నడుముకు దట్టి, వీరకాసె, చేతుల్లో ఈటెతో, డాకాలు సాచి యుద్దానికి సిద్ధమైనట్టుగా ఈ శిల్పం చెక్కి ఉన్నట్టు గుర్తించారు. వీరునికి కుడి పక్కన పెద్ద దమ్మిల్లంతో చెవులకు జూకాలు, మెడలో హారం, నడుమున నీవీబంధం, చేతుల్లో ఈటెతో శత్రువును చంపుతున్న వీరనారి నిలబడి ఉందని తెలిపారు. వీరునికి ఎడమవైపున పెద్ద దమ్మిల్లంతో, జూకాలతో, మెడలో హారంతో, నడుమున మేఖల కుడిచేతిలో పువ్వు, ఎడమచేత కమండలం పట్టుకొని కనిపిస్తున్న స్త్రీ ఆ వీరుని సతి అని అన్నారు. వీరుని కుడి పక్కన ఈటెతో శత్రువుని చంపుతున్న ఆ నారీమణి కూడా వీరుని వీరపత్ని అని తెలిపారు. బహుశా ఈ వీరునికి ఇద్దరు భార్యలు ఉండొచ్చని చెప్పారు. అక్కడ జరిగిన పోరులో భర్తతో పాటు పోరాడిన భార్య చనిపోగా, మిగిలిన భార్య భర్తతో పాటు సతీసహగమనం చేసిందని తెలిపారు. ఇలాంటి వీర స్మారక శిల ఇంతకు ముందు ఎన్నడూ లభించలేదని, ఈ సతి శిల కళ్యాణీ చాళుక్యుల కాలానికి చెందిందని చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీ రామోజు హరగోపాల్‌ అన్నారు. ఈ శిలల పరిశీలనలో కొలిపాక శ్రీనివాస్‌ వెంట గ్రామస్తులు నర్ర కళాధర్‌, నాంపల్లి స్వామి, శ్యాం కుమార్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -