కాల్పుల విరమణకు ఇరాన్ ‘నో’
ఇరాన్ సుప్రీం నేతగా మొజ్తాబా ఖమేనీ
నూతన సుప్రీం నేతకు పుతిన్ అభినందనలు
మొజ్తాబాపై దాడులు చేస్తే వ్యతిరేకిస్తాం : చైనా
నెతన్యాహుతో చర్చించాకే యుద్ధం ముగింపుపై నిర్ణయం : ట్రంప్
ఇరాన్ సుప్రీం నేతగా అలీ ఖమేనీ
తనయుడు అయతొల్లా మొజ్తాబా ఖమేనీ నియమితులయ్యారు. ఆయనకు చైనా, రష్యా వంటి దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. మొజ్తాబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎవరు వచ్చినా వారిని అంతం చేస్తామని హెచ్చరిస్తూ ఇజ్రాయిల్ ఇప్పటికే ప్రకటనలు చేసిన విషయం విదితమే. అయితే ఇరాన్ ఆ హెచ్చరికలను ఏ మాత్రమూ లెక్క చేయకుండా నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీని తీసుకొచ్చింది. తాజాగా ఆయనకు చైనా మద్దతుగా నిలిచింది. మొజ్తాబా ఖమేనీపై దాడులు చేస్తే వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. మరోపక్క ఇజ్రాయిల్-అమెరికా దాడులకు దీటుగా బదులిస్తోన్న ఇరాన్ తన ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ప్రతిదాడులను కొనసాగిస్తోంది. కాల్పుల విరమణకు నో అంటోంది. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అంతం చేస్తే ఇరాన్‌ను దారిలోకి తెచ్చుకోవచ్చని భావించిన అమెరికా-ఇజ్రాయిల్‌కు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. తాము చేసిన బెదిరింపులను కూడా లెక్క చేయకుండా ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌ను నియమించుకోవడం, ప్రతిదాడులను మరింత తీవ్రం చేస్తూ కాల్పుల విరమణకు కూడా ససేమిరా అనడంతో దిక్కుతోచని పరిస్థితి ఆ రెండు దేశాలకు ఏర్పడిందని అంటున్నారు.
(నవతెలంగాణ – సెంట్రల్ డెస్క్)
అయతొల్లా మొజ్తాబా ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం నేతగా నియమితుడైన తర్వాత ఇజ్రాయిల్ సోమవారం క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్, దక్షిణ ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేశామని ఇజ్రాయిల్ తెలిపింది. ఇస్ఫహాన్ గవర్నరేట్ భవనంపై జరిగిన దాడిలో ముగ్గురు గాయపడగా ఇద్దరు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుబడి ఉన్నారు. హెజ్బొల్లాతో సంబంధం ఉన్న సంస్థకు చెందిన శాఖలపై దాడులు చేస్తానని ముందుగానే హెచ్చరించిన ఇజ్రాయిల్…లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై దాడి జరిపింది. ఇజ్రాయిల్ వైపు నుంచి జరుగుతున్న దాడులు ఉధృతం కావడంతో లెబనాన్ ప్రజలు అరిడా సరిహద్దును దాటి లిబియాకు చేరుకుంటున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఇజ్రాయిల్ జరిపిన దాడులలో లెబనాన్‌లో 83 మంది చిన్నారులు చనిపోయారని యునిసెఫ్ వివరించింది. దక్షిణ లెబనాన్‌పై జరిగిన దాడిలో ఇద్దరు పారా మెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ పరిస్థితిపై చర్చించేందుకు భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరచాలని ఫ్రాన్స్ కోరింది. అటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలలోని అమెరికా కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని విస్తృతంగా దాడి చేస్తోంది. ఆదివారం రాత్రి బహ్‌రైన్‌లోని సిత్రా దీవిపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో 32 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని బహ్‌రైన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని నాటో రక్షణ వ్యవస్థలు తటస్థం చేశాయని టర్కీ చెప్పింది. భద్రతాపరమైన ముప్పు పెరిగే అవకాశం ఉన్నం దున ఆవాసాలను వదిలి బయటికి రావద్దని ఖతార్ తన ప్రజలకు సూచించింది. తమ నౌకాదళం కువైట్‌లోని అదిరి హెలికాప్టర్ స్థావరంపై డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందని ఇరాన్ ఐఆర్‌జీసీ ఒక ప్రకటన చేసింది. స్థావరంలోని ఇంధన, గ్యాస్ ట్యాంకు లను, అమెరికా హెలికాప్టర్ ర్యాంపులను, లాజిస్టిక్ సౌకర్యాలు ధ్వంసమయ్యాయని చెప్పింది. ఇదిలావుండగా దాడులు కొనసాగి నంత కాలం కాల్పుల విరమణ కోసం మధ్య వర్తిత్వ ప్రయ త్నాలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖై స్పష్టం చేశారు. స్వీయ రక్షణకు ఇరాన్ ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. తుర్కియే, అజర్‌బైజాన్, సైప్రస్‌పై తాము దాడులు జరుపుతున్నామంటూ వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇరాన్ చమురు నిల్వలపై అమెరికా, ఇజ్రాయిల్ కన్నేశాయని, ఆ దేశాల దాడులు అంతర్జాతీయ చట్టాలను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆరోపించారు.
భగ్గుమన్న చమురు ధరలు
యుద్ధం కారణంగా సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారల్ ముడి చమురు ధర వంద డాలర్లు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు (తేలికపాటి, తియ్యని చమురు) 2022 తర్వాత తొలిసారిగా 114 డాలర్లు దాటింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సౌదీ అరేబియా సంస్థ అరామ్కో రెండు చమురు క్షేత్రాలలో ఉత్పత్తిని నిలిపివేసింది. అనేక అరబ్ దేశాలు కూడా చమురు ఉత్పత్తిలో కోత విధిం చాయి. పెరుగుతున్న చమురు ధరలపై చర్చిం చేందుకు జీ7 దేశాలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. బ్రిటన్ ఛాన్సలర్ రాచల్ రీవ్స్ సహా ప్రముఖ పారిశ్రామిక దేశాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజర య్యారు. యుద్ధం కారణంగా కలిగే ఆర్థిక ప్రభా వంపై చర్చించారు. ఇంధన సరఫ రాలకు దీర్ఘ కాలం ఆటంకం ఏర్పడుతుందన్న భయాం దోళనల నేప థ్యంలో అంతర్జాతీయ చమురు ధర సుమారు 120 డాలర్లకు చేరింది.
పరస్పర నిర్ణయం మేరకే యుద్ధం ముగింపు : ట్రంప్
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూను సంప్ర దించి ఇరాన్ యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో నిర్ణయిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్‌పై జరుపుతున్న దాడుల విష యంలో బ్రిటన్ అను సరిస్తున్న వైఖరిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్రంప్‌తో బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ టెలిఫోన్ సంభాషణ జరిపారు. మధ్య ప్రాచ్యానికి యుద్ధ విమాన వాహక నౌకలను పంపాలని అనుకుంటు న్నామని స్టార్మర్ చేసిన ప్రకటనపై ట్రంప్ స్పందిస్తూ ఇప్పటికే గెలిచిన యుద్ధా నికి వాటి అవసరం ఏముం దని ప్రశ్నించారు. మధ్యప్రాచ్యంలో కొన సాగుతున్న యుద్ధం కారణంగా లెబనాన్ పార్లమెంట్ పదవీకాలాన్ని రెండు సంవత్సరాల పాటు పొడిగించారు.
మొజ్తాబాకు పెరుగుతున్న మద్దతు
ఇరాన్ సుప్రీం నేతగా ఎంపికైన అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఇరాన్ నూతన సుప్రీం నేతను లక్ష్యంగా చేసుకొని ఏ చర్యకు పాల్పడినా వ్యతిరేకిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జియాకున్ స్పష్టం చేశారు. ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల గ్రూపులు మొజ్తాబా నియామకాన్ని స్వాగతించాయి. మొజ్తాబాకు మద్దతుగా టెహ్రాన్ ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు.
ఇంధన సుంకాల ఎత్తివేతకు వియత్నాం యోచన
ఇంధన దిగుమతులపై సుంకాలను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు వియత్నాం తెలిపింది. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న యుద్ధం కారణంగా చమురు సరఫరాలకు ఆటంకం ఏర్పడుతోంది. 2022 తర్వాత చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో సుంకాలను రద్దు చేయాలని వియత్నాం భావిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని పెట్రోలియం ఉత్పత్తులపై దిగుమతి పన్ను రేట్లను ‘జీరో’ స్థాయికి తెచ్చేందుకు డిక్రీని రూపొందించానని చెప్పింది. యుద్ధం కారణంగా వియత్నాంలో ఇంధన ధరలు బాగా పెరిగాయి. వియత్నాంలో అత్యధికంగా వినియోగించే గ్యాసోలిన్ ధర 21 శాతం పెరిగింది. డీజిల్ ధరలు కూడా యాభై శాతానికి పైగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర ధరల ప్రొటోకాల్స్‌ను అమలు చేసింది.
ఇరాన్ దాడులను అడ్డుకున్నాం : యూఏఈ
ఇరాన్ డ్రోన్లను, క్షిపణులను అడ్డుకున్నామని యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ తెలిపింది. తన వాదనకు మద్దతుగా వీడియో ఫుటేజీని విడుదల చేసింది. ఇరాన్ ఇటీవలే యూఏఈపై 16 బాలిస్టిక్ క్షిపణులు, 117కు పైగా డ్రోన్లపై ప్రయోగించింది. సముద్రంలో పడిపోయిన ఒక క్షిపణి మినహా అన్నింటినీ మధ్యలోనే అడ్డుకున్నామని యూఏఈ చెప్పింది. నాలుగు డ్రోన్లు యూఏఈ భూభాగంలో పడ్డాయి.



