నీ తాపపు హదయాకాశం కోసం
నా గుండెల మీద
రెండు నిండు చంద్రుళ్ళు అలరించాయి కదా
విధి వక్రించి ఇప్పుడొక చంద్రుణ్ణి
క్యాన్సర్ రాహువు మింగేస్తే,
నింగి నిత్యామావాస్య చీకటై
రక్తం ముద్దగా రాలిపోయింది
మురిపాలనిచ్చే నా పాలవెల్లువ ఎడారిబీడైపోయింది
అప్పుడనుకోలేదు
దేహంలోని పూర్ణకలశాలు మాత్రమే
మనల్ని కలిపి వుంచే పాశమని!
మోహావేశమొక్కటే
మన మధ్య మలిపిన బంధమని!
ఇన్నేళ్ళ మన కాపురంలో
ఒక చిన్న అవయవం తేల్చి చెప్పింది
నీకు నేనేమీ కానని!
ఓ అవయవం పాటు కూడా చెయ్యనని!
విముఖతను ప్రదర్శించిన నీ మబ్బు ప్రేమపొరలు
నా పమిట చాటు హదయంపై
కమ్చీదెబ్బలు వేసాయి
నాకు నేనే కొత్తగా
మళ్లీ ఇప్పుడు పరిచయమవుతున్నాను
రంగురంగులుగా రంగవల్లులుగా
విస్తరించిన ఆ జీవితం కల
కోసేసిన ఆ చందమామతో పాటే అంతరించిపోయింది
మాటల ఈటెలతో గుచ్చే బంధుమిత్రులతో పాటు
నువ్వు ఈ కోతను సహించలేదన్న నిజం
నా మనసుని దహించివేస్తోంది
చేజారిన ఆ చందమామ
ఈ గుండెల మీద ఎప్పటికీ వెలగదు
నీ చూపు చేసిన గాయం మాత్రం
నాలో మాయని మచ్చగా మిగిలిపోయింది
ఓ చందమామ మొహం చాటేసినా
నా గుండె వెనుక హదయం
ఇంకా వెలుగులీనుతూనే ఉంది
కోరిక తీరాక ఆలిబొమ్మని గిరాటు వేసే
నీ మనసు వికతరూపం చూసి
బాధతో నా చూపు విషాదంగా రక్తమోడుతోంది
నాలో ఓ చందమామ రాలిపోయినా పర్లేదు
నేను సగర్వంగా తలెత్తుకుని బతకగలను
దష్టి వంకరపోయిన నీ లేమి బుద్ధితో
భార్యగా ఎప్పటికీ కలిసి బతకలేను
( ఒక రొమ్ము క్యాన్సర్ బాధిత కోసం )
హామీపత్రం: ఈ కవిత ‘శీర్షిక: నాలోంచి నీకు దూరమవుతూ’..! నా స్వీయ రచన. ఇది దేనికీ అనువాదంకానీ, అనుకరణకానీ, కాపీకానీ కాదు. గతంలో ఎక్కడా ఎప్పుడూ ప్రసారంకానీ, ప్రచురితంకానీ కాలేదు. ఏ ఇతర పత్రికల్లోనూ, వెబ్ మ్యాగజైన్లలో నూ, ప్రసారమాధ్యమాల్లోనూ ప్రచురితం కాలేదు. మీకు ఆమోదయోగ్యమైతే స్వీకరింపగలరు.
- ఎన్. లహరి, 9885535506