Monday, December 15, 2025
E-PAPER
Homeదర్వాజరేపటిపై అచంచల విశ్వాసం 'నువ్వు గింజవైతే!'

రేపటిపై అచంచల విశ్వాసం ‘నువ్వు గింజవైతే!’

- Advertisement -

కవి వ్యక్తీకరణపై అతని మానసిక స్థితి, అతను పెరిగిన సామాజిక పరిసరాల ప్రభావం, జీవన శైలి ఇలా అనేక అంశాల పాత్ర ఉంటుంది. ‘నువ్వు గింజవైతే’ హనీఫ్‌ కవితా సంపుటిలోని కవితలన్నీ వైయక్తిక, వ్యక్తిగత స్పందనలు మాత్రమే కావు, సమాజం ఇచ్చినటువంటి అనేక సంఘర్షణలకు ప్రతిరూపం, సంవేదనల ప్రతిఫలనం అని చెప్పవచ్చు. అతని బాల్యం తిప్పనపల్లి గ్రామం, చంద్రుగొండ అడవి అంచుల మీద సాగింది, యవ్వనం సింగరేణి బొగ్గు గనుల ధూళిపొరల కప్పుకుంది. అక్కడి కార్మిక జీవితాల బాధలు, వెతలు, సంఘర్షణ అనుభవాలుగా మిగిలిపోయాయి. మార్క్సిజం భావజాలంతో ఆవరించిన కార్మిక సంఘాల, సింగరేణి యాజమాన్యం మధ్య కార్మిక సమస్యలపై నిత్యం జరిగే వాదవివాదాలు, రాజకీయ, ఆర్ధిక సమస్యలు వీటన్నింటికి ప్రత్యక్ష సాక్షిగా ఉంటూ వాటి నుండి పొందిన అనుభవాలు, ఆర్తి, ఆవేదనలు అతని కవిత్వంలో సూటిగాను, తాత్వికంగాను ప్రతిబింబిస్తాయి. ‘నువ్వు గింజవైతే’ శీర్షికలోనే ప్రశ్నించే క్రియాశీల తత్వం కనబడుతుంది. పదునైన భాష, క్లుప్తత, భావ తీవ్రత, సూటిదనం హనీఫ్‌ కవిత్వపు ప్రధాన లక్షణాలు. తాత్వికతగా ఆలోచిస్తే ‘గింజ’ జీవికకు ప్రతీక. జీవితాన్ని విశ్లేషించడానికి గింజను metaphor గా ప్రయోగించాడు కవి. గింజ శక్తివంతమైనది. ఎదుగుదల దాని లక్ష్యం. ఇది ఒక భౌతిక రూపం మాత్రమే కాదు, ఒక ప్రణాళిక. మొక్కగా ఎదిగే పరిణామ దశను సూచిస్తుంది. గింజ ఎదిగే దశలో తనను కప్పివుంచిన మట్టి పొరలను, ధూళి వలయాలను ఛేదించుకొని వెలుతురు వైపుకు పయనిస్తుంది. కవి నిద్రపోతున్న సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నమే ”నువ్వు గింజవైతే”. ఒక మార్మిక అభివ్యక్తి. ఒక symbolic presentation.
”అడవికి వెళ్ళినప్పుడు/ పర్కికంప గాయపర్చకపోతే/ వండిన అన్నంలో ఏదో వేయడం మర్చిపోయినట్టుగా ఉంటుంది/ రాళ్లు రప్పలు లేని అడవి ఉంటుందా?” అని కలవరిస్తాడు కవి. రాజకీయాల స్వార్ధంతో చేసే గాయం వేరు, అడవి కంప చేసే గాయం వేరు. సమస్యలు, కష్టాలు లేని జీవితం వుంటుందా? ముందడుగు చూసి వేయాలి అనే హెచ్చరిక అడవి తల్లి చేస్తుంది. రాజకీయ నేతల ప్రమేయం, కార్పొరేట్‌ వ్యవస్థ, అభివద్ధి నెపంతో అడవుల విధ్వంసం వెరసి ఆదివాసీ జీవితాలపై కత్తి వేలాడుతూవుండటం గమనించిన కవి
”అభివద్ధి మురికి కూపాల మధ్య/ బుల్డోజర్‌ రణగొణల మధ్య/ రాళ్ళ క్వారీల మధ్య…” అంటూ ‘ఆదివాసీ మేకలు కాసే పిల్లను కోల్పోవడం అంటే/ ఆమె చేతిలోని కొడవలి కట్టిన వంకీ కర్రను విరిచేయడమే… పశు, పక్ష్యాదుల నోటికాడి ఆహారాన్ని దొంగలించడమే/ అడవి తన ముక్కు పుడకను పోగొట్టుకోవడమే..’ అని తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తాడు. ఈ కవితా పంక్తులు ‘ముక్కు పుడక’ కవితలోనివి. ముక్కు పుడక సంస్కతి సంప్రదాయానికి ప్రతీక, అడవి ఆదివాసీల జీవితాలకు, అస్తిత్వానికి నిట్టాడి గానే గాక ప్రకతి, పర్యావరణానికి ఊపిరి పోస్తుంది. అడవి మీద దాడి చేయడమంటే ఒక సంప్రదాయానికి, అస్తిత్వానికి, పర్యావరణానికి చేటు చేయడమే. ఆ కుట్రను పసిగట్టిన కవి హనీఫ్‌ ఈ కవిత ద్వారా తన ఆవేదనను ప్రకటిస్తున్నాడు.
మరో కవిత ‘నిశ్శబ్దం’లో ”ఇక్కడ/ శబ్దం కనుమరుగై పోయింది…/ అన్ని డప్పులు అదశ్యమైనాయి/ దేశం ఖాళీ చేసి పోయినట్టు/ వాటి నీడలు కూడా కన్పించడం లేదు/ ఈ భీకర రాత్రి కుక్కల నాల్కలను కత్తిరించి వుంటుంది/ భాషను కోల్పోయి మూగ మోడులైనాయేమో?/ మేధావులకు పాలకులు వెచ్చటి రగ్గేదో కప్పేసి వుంటారు …. ప్రలోభాలకు ఆశపడి మౌనం దాల్చివుంటుంది” సమాజాన్ని, రాష్ట్రాలను రక్షించాల్సిన ఆయా బాధ్యత ప్రభుత్వాలది. అణగారిన పక్షాలకు, వివక్షకు గురవుతున్న సాధారణ ప్రజలకు అండగా ఉండాల్సిన న్యాయ, రక్షణ, పాలక వ్యవస్థలే అవినీతికి పాల్పడితే గళమెత్తాల్సిన మేధావులు ప్రలోభాలకు ఆశపడి మౌనాన్ని ఆశ్రయించారా? అని కవి ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
సామాజిక చైతన్యాన్ని ప్రేరేపించే భావజాలం, ధిక్కార స్వరాన్ని వినిపించే పదజాలం, పోరాట స్వభావాన్ని ప్రదర్శించే నైజం ఒక వైపు ఐతే, తాత్వికతను చూపే కవితలు కూడా ఈ సంపుటిలోవున్నాయి. అందుకు నిదర్శనం ‘శిల్పులు’ అనే కవిత.
”ఇద్దరు శిల్పులు/ నాలో కడివెడు నీళ్లు నింపి వెళ్లారు/ ఏ చిన్న జాలిగొలిపే దశ్యం చూసినా/ జీవనదిని చేస్తాయి నన్ను/ ఆ తడి నాలో మిగిలే వరకే బతకమన్నారు/ ఆ తరువాత పనేముందిక్కడ..!”
ఈ కవితలో పుట్టుక లక్ష్యం ఏమిటి అన్నది కనబడుతుంది. శిల్పులు – అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అతనిలో సున్నితత్వాన్ని, మానవత్వాన్ని, ఎదుటి వారి పట్ల ప్రేమను చూపాలనే ఆదర్శాన్ని నేర్పించి వెళ్లిన సంస్కారవంతులైన తల్లిదండ్రులు పై వాక్యాల్లో దర్శనమిస్తారు. శిల్పులు, తడి, కడివెడు నీళ్లు ఈ పదాలన్నీ సింబాలిక్‌గా జూతీవరవఅ్‌ చేయబడి కవితకు కవిత్వపు సొబగులు అద్ధి సౌందర్యాన్ని ప్రదర్శిస్తాయి.
అలాగే ‘మరణం అంటే మరేమి కాదు’ కవిత అదే దారిలో సాగుతుంది. ”మరణం అంటే మరేమి కాదు/ ‘హం’ చేస్తున్న పాట/ చివరి చరణం పలకడమే/ నదుల చలనం, గాలి హోరు మౌనం దాల్చడం.. రేపటి కాల్‌ లిస్ట్‌ నుంచి డిలీట్‌ చేయడమే… తాత్వికంగా ఆలోచిస్తే మరణాన్ని వెంటబెట్టుకొని నడవడమే జీవితం. కవిలోని ఆశావహ దక్పథం అర్ధమవుతుంది. ఆకాశం నుండి చినుకై నేల రాలడం/ ఆవిరై పైకేగడం’ అనే వాక్యంతో కవిత్వంలో precipitation and evaporation system అనే శాస్త్రీయతను జోడించి పరామర్శించడం వల్ల ప్రాకతిక చర్య అభివ్యక్తమవుతుంది. సారాంశంగా చూస్తే వర్తమాన సామాజిక, రాజకీయాల ప్రస్తావన, కార్పొరేట్‌ ల కుట్రలు, అధికారాల అవినీతిని నిరసించే స్వరం వ్యక్తమవడమే గాక కవిత్వసామాగ్రి, నిర్మాణం, శైలి ప్రత్యేక రీతిలో దర్శితమవుతాయి. జనహితం, సమాజహితం ఆలోచించే స్థితికి వ్యవస్థలు రావాలని ఆశిస్తున్న కవి ఆకాంక్ష ఈ సంపుటిలో ప్రకటితమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -