కొత్త నేరాలపై సరికొత్త అస్త్రాలు సిద్ధం చేయండి
దీనికోసం సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ
సైబర్, డ్రగ్స్, డార్క్ వెబ్‌ను ఎదుర్కొనేలా పోలీస్ వ్యవస్థ మారాలి
అధికారుల పనితీరుకు ఏ, బీ, సీ గ్రేడింగ్..దాని ఆధారంగానే ఇకపై పోస్టింగ్‌లు
‘మన్ కీ బాత్’లా వన్ సైడ్ వద్దు..పోలీసింగ్‌లో ‘హ్యూమన్ టచ్’ ముఖ్యం :
‘ఫ్యూచర్ రెడీ పోలీసింగ్’ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి:.
మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం పూర్తిగా మారిపోయిందని, సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ లాంటి కొత్త సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థ తక్షణమే సాంకేతికంగా ‘అప్‌గ్రేడ్’ కావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ఫ్యూచర్ రెడీ పోలీసింగ్’ రిట్రీట్ 2026 ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథి పాల్గొని ప్రసంగించారు. భవిష్యత్తు సవాళ్లు, సాంకేతికత వినియోగం, చట్టాల మార్పు, సిబ్బంది హేతుబద్ధీకరణ తదితర కీలక అంశాలపై ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
నేరాల స్వరూపం మారింది..
ఒకప్పుడు రాష్ట్రంలో తీవ్రవాద సమస్య ఎక్కువగా ఉండేదని, దాన్ని ఎదుర్కొనేందుకు అప్పట్లో ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్, అవినీతి నియంత్రణకు ఏసీబీ తదితర వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నామని సీఎం గుర్తుచేశా రు. కానీ, ఇప్పుడు ప్రపంచంలో వచ్చిన మార్పులకు పాత వ్యవస్థలు, పాత పోలీస్ మాన్యువల్ సరిపోవడం లేదని అభిప్రాయపడ్డారు. సైబర్ క్రైం, డ్రగ్స్ సరఫరా, డార్క్‌వెబ్‌సైట్ వంటి నేరాలను అరికట్టేందుకు డిజిటల్ ఎవిడెన్స్, సాంకేతిక నైపుణ్యంపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు.
కొత్త చట్టాలకు సీఎస్ కమిటీ
నార్కోటిక్స్, సైబర్ క్రైమ్‌ల కట్టడికి కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను చట్టరూ పంలోకి తెచ్చే క్రమంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల మధ్య ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకు ండా చూసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థా యి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
మెగా డేటా సెంటర్.. సిబ్బంది రేషనలైజేషన్
ప్రస్తుతం చిన్న జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన పోలీసుల కేటాయింపులు జరగాల్సి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మానవ వనరుల సద్వినియోగంలో భాగంగా డీజీపీ తక్షణమే సిబ్బంది రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా ఆ సమాచారాన్ని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో నిక్షిప్తం చేసేలా ఒక ‘మెగా డాటా సెంటర్’ను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ మహానగరం భవిష్యత్తు అవసరాల కోసం వచ్చే 25 ఏండ్లకు సరిపడా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని తెలిపారు.
పనితీరు ఆధారంగానే పోస్టింగ్‌లు.. ‘మన్ కీ బాత్’ వద్దు!
అధికారుల పనితీరు ఆధారంగా ఏ, బీ, సీ క్యాటగిరీలుగా వర్గీకరించి, ఆ డేటా ఆధారంగానే వారికి పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఉన్నతాధికారులు ‘సూపర్ బాస్’లమనే ఫీలింగ్ పక్కనపెట్టి కింది స్థాయి సిబ్బందికి చేరువ కావాలన్నారు. పోలీసింగ్‌లో ‘హ్యూమన్ టచ్’ చాలా ముఖ్యమన్నారు. ‘మన్ కీ బాత్’ను ఉద్దేశించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అందులో చెప్పేది ఒక సైడే వినాల్సి ఉంటుందని, మనం చెప్పేది ఉండదని వ్యాఖ్యానించారు.
ప్రతి డిసెంబర్‌లో రిట్రీట్
పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిధులను లావిష్‌గా కాకుండా సక్రమంగా వాడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై ప్రతి ఏటా డిసెంబర్‌లో ఈ రిట్రీట్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అంతకుముందు ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలు చర్చించిన వివిధ అంశాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సంబంధిత అధికారులు వివరించారు. రెండు రోజులుగా జరిగిన ఈ రిట్రీట్ కార్యక్రమానికి రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, ఐపీఎస్ అధికారులు తమ క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ నేరాల అదుపులో నూతన పోకడలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ రిట్రీట్‌లో అన్ని జిల్లాల ఎస్పీలు మొదలుకొని డీజీపీ అధికారుల వరకు పాల్గొన్నారు.
అప్‌గ్రేడ్ అవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



