Tuesday, October 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ పనులు పూర్తి చేయాలి

ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ పనులు పూర్తి చేయాలి

- Advertisement -

ప్రభుత్వాల చేతకానితనం వల్లే ఆలస్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
ఉప్పల్‌ రింగ్‌రోడ్‌లో నిరాహార దీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఉప్పల్‌

హైదరాబాద్‌ ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ప్రజలు ఎన్నాళ్లు ఈ అవస్థలు పడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల గోస పట్టదా..? అని ప్రశ్నించారు. ఏడేండ్లు గడుస్తున్నా ఎలివేటర్‌ కారిడార్‌ పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నాయన్నారు. ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 నెలల్లో పూర్తి చేయాల్సిన రోడ్డు ఏడేండ్లు గడిచినా 50 శాతం మాత్రమే పనులు అయ్యాయన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌, వరంగల్‌ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు గుంత లమయంగా మారడంతో ప్రమాదాలు జరుగుతు న్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ విషయంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నుంచి ముఖ్యమంత్రి, ఆర్‌అండ్‌బీ మంత్రికి లేఖ రాస్తామని చెప్పారు. ఈ పోరాటానికి పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

సీపీఐ(ఎం) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. ఉప్పల్‌-నారపల్లి పనులపై రకరకాల ప్రకటనలు వస్తున్నాయి తప్పితే పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్నారు. దసరా వరకు పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇప్పుడు 2026 దసరా వరకు పూర్తి చేస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి వరకైనా పూర్తవుతుందా..? అని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. గతంలో ఎంపీగా పని చేసిన సీఎం రేవంత్‌ రెడ్డికి ఇక్కడి ఇబ్బందులు తెలుసని, చొరవ తీసుకోవాలని కోరారు. గతంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర, సంతకాల సేకరణ సైతం చేపట్టినట్టు తెలిపారు.

మద్దతు తెలిపిన పలువురు
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు బీఆర్‌ఎస్‌, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ మాజీ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ నగరంలో 36 ఫ్లైఓవర్లు నిర్మించామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందన్నారు. ఉప్పల్‌ నుంచి పీర్జదిగూడ వెళ్లడానికి 40 నిమిషాల సమయం పడుతోందని, గుంతల రోడ్లతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీపీఐ ఉప్పల్‌ మండల కార్యదర్శి సత్య ప్రసాద్‌ మాట్లాడుతూ.. పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, ఎం.వినోద, రాజశేఖర్‌, ఎం.శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు సబిత, శంకర్‌, లక్ష్మణ్‌, సంతోష్‌, ఉప్పల్‌ మండల కార్యదర్శి వెంకన్న, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -