పల్లె ఎన్నికలకు పట్నం ఓట్లే పట్టు
ఒక్క ఓటు కోసం విందులు, రవాణా వరకు రిక్వెస్టులు
నవతెలంగాణ- (కల్కూరి ఎల్లయ్య)
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైనా.. అసలైన పోటీ మాత్రం హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాలలో ఉన్న గ్రామీణ ఓటర్ల మనసుల్లో నడుస్తోంది. పల్లె నుంచి వలస వచ్చిన వారి ఓట్లు ఒక్కో గ్రామానివి రెండొందలకు పైగా ఉండటంతో.. ఒక్క ఓటు కూడా చేజారకుండా చూసుకోవాలని అభ్యర్థులు విందులు, వినోదాలు, రవాణా సదుపాయాలు, వ్యక్తిగత రిక్వెస్టులతో పట్నం వైపు పరుగులు తీస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి ప్రతి అస్త్రాన్నీ ఉపయోగిస్తున్నారు. కొంతమంది తమ స్నేహితులు, బంధువులు, సంఘాల ద్వారా నగర ఓటర్లను కలిసే ఏర్పాటు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు విలువను అర్థం చేసుకున్న అభ్యర్థులు ఖర్చులకు వెనుకాడటం లేదు. ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు ఒక్క ఓటుతోనే గెలిచిన, ఓడిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చినప్పుడు టాస్ వేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దాంతో ఇప్పుడు పంచాయతీ పోటీ కేవలం గ్రామాల్లోనే కాకుండా పట్నానికి చేరిందని చెప్పొచ్చు. పల్లె ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించేందుకు గ్రామంలోని ఓటరే కాకుండా, నగరాల్లో తమ ఊరి జ్ఞాపకాలను మోస్తున్న ఓటరు కీలకంగా మారారు. ఇక ఈసారి ఆ పట్నం ఓట్లు ఎవరిని మచ్చిక చేసుకుంటాయో అన్నదే పల్లె రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మెజారిటీ నిర్ణయించేది ఇక్కడి ఓట్లే
గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపుపై అనేక మంది ఉత్సాహంతో ఉన్నారు. ఊర్లలో కలిసి మెలిసి ఉండే వారే ఈ ఎన్నికలలో ప్రత్యర్థులుగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో గ్రామంలోని ఓట్లు ఒకరికి తగ్గి మరొకరికి పెరిగే అవకాశం ఉన్నప్పుడు ”పట్నం ఓట్లను” గంప గుత్తగా తమ ఖాతాలో చేసుకోవాలని అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పట్నం ఓట్లే సర్పంచ్ సీటు నిర్ణయించేందుకు కీలక పాత్ర పోషించనున్నాయి.
మొదలైన దావతులు
నగరంతోపాటు శివారు ప్రాంతాలలో ఉన్న గ్రామీణ ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ఇప్పటి నుంచే ముక్క, సుక్క పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. అదే ఈ దావత్‌లు గ్రామాల్లో ఏర్పాటు చేస్తే అది ఎన్నికల నిబంధనల కిందకు వస్తుంది. ఇక్కడ అయితే ఎవరూ పట్టించుకోరని అభ్యర్థులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలానా ఓట్లు మనకు ఖచ్చితంగా పడాలి.. వారికి ఎలాంటి ఏర్పాట్లైనా చేయడానికి వెనుకడుగు వేయొద్దు అంటూ పోటీలో ఉన్న అభ్యర్థులు తమ బంధువులు, అనుచరులు నమ్మకస్తులు, సామాజిక తరగతుల వారికి అప్పగిస్తున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో నగర ఓటర్లే కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



