న్యూఢిల్లీ : బంగారం ధరలకు అమెరికా ఆజ్యం పోస్తోంది. వెనిజులాపై అనుహ్యాంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను దుర్మార్గంగా అరెస్ట్ చేయడంతో భౌగోళిక ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామంతో డాలర్ కంటే భద్రతగా భావించే బంగారం ధరలు ఎగిశాయి. సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2,400 పెరిగి రూ.1,38,370కి చేరింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.2,200 ఎగిసి రూ.1,26,850కి చేరింది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.1,38,220గా, 22 క్యారెట్ల ధర రూ.1,26,700గా నమోదయ్యింది. 10 గ్రాముల వెండిపై రూ.80 పెరిగి రూ.2,650గా, కిలో వెండిపై రూ.8,000 ఎగిసి రూ.2.65 లక్షలుగా పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్క ఔన్స్ పసిడి 1.40 శాతం ప్రియమై 4,391 వద్ద నమోదయ్యింది. గడిచిన వారంలో ఈ లోహం ధర 3.68 శాతం పెరిగింది.



