Friday, December 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులా తీరంలో ఆగని అమెరికా ఆగడాలు

వెనిజులా తీరంలో ఆగని అమెరికా ఆగడాలు

- Advertisement -

ఆయిల్‌ ట్యాంకర్‌ స్వాధీనం
ఇది సముద్ర దొంగతనమే : కారకాస్‌ ఆగ్రహం
కారకాస్‌ :
డోనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వెనిజులాపై కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా వెనిజులా తీరంలో ఓ ఆయిల్‌ ట్యాంకర్‌పై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుంది. అధ్యక్ష భవనంలో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘మేము ఇప్పుడే వెనిజులా తీరంలో ఒక ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నాము. అది చాలా పెద్ద ట్యాంకర్‌. ఇప్పటి వరకూ మేము స్వాధీనం చేసుకున్న ట్యాంకర్లలో ఇదే అత్యంత పెద్దది’ అని చెప్పారు. కాగా ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న దృశ్యాలతో ఉన్న వీడియోను అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ విడుదల చేశారు. ఆంక్షలను ఎదుర్కొం టున్న ట్యాంకర్‌ వెనిజులా నుంచి ఇరాన్‌కు ముడి చమురును రవాణా చేస్తోందని తెలిపారు. ఎఫ్‌బీఐ, రక్షణ శాఖ, హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం, అమెరికా తీరగస్తీ దళం సంయుక్తంగా ఈ దాడి నిర్వహించాయని వివరించారు. ‘వెనిజులా ఆయిల్‌ ట్యాంకర్‌ విదేశీ ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా అక్రమంగా చమురును రవాణా చేస్తోంది. ఈ ట్యాంకర్‌పై అమెరికా అనేక సంవత్సరాలుగా నిషేధం విధిస్తోంది’ అని చెప్పారు. ట్యాంకర్‌లోని చమురును ఏం చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ సమాధానమిస్తూ దానిని తమ వద్దే ఉంచుకుంటామని చెప్పారు. ఈ ట్యాంకర్‌ రెండు రోజుల క్రితం గయానా పతాకంతో ప్రయాణించిందని బీబీసీ తెలిపింది. అయితే అది తమ దేశంలో రిజిస్టర్‌ అయిన నౌక కాదని గయానా స్పష్టం చేసింది.

దాడి జరిగిందిలా…
బాండీ విడుదల చేసిన వీడియో ఫుటేజ్‌ ప్రకారం…అమెరికా సైనిక హెలికాప్టర్‌ ఓ పెద్ద నౌక పైన చక్కర్లు కొట్టింది. అందులోని సైనికులు తాళ్ల సాయంతో నౌకపై దిగారు. వారు తుపాకులు పట్టుకొని నౌకలో తిరిగారు. యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ నుంచి హెలికాప్టర్‌ బయలుదేరిందని సీనియర్‌ సైనికాధికారి ఒకరు తెలిపారు. ఈ వాహక నౌకను గత నెలలోనే అమెరికా ప్రభుత్వం కరేబియన్‌లో మోహరించింది. ఇందులో రెండు హెలికాప్టర్లు, పది మంది తీర గస్తీ సభ్యులు, పది మంది నౌకాదళ సభ్యులతో పాటు ప్రత్యేక దళాలు కూడా ఉంటాయి. కాగా ఇలాంటి మరిన్ని దాడులకు ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధపడుతున్నదని సమాచారం.

దొంగలు…హంతకులు : వెనిజులా
అమెరికా చర్యను వెనిజులా తీవ్రంగా ఖండించింది. దీనిని అంతర్జాతీయ సముద్ర దొంగతనంగా అభివర్ణించింది. వెనిజులా ఎన్నడూ ‘చమురు కాలనీ’ కాబోదని దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురో గతంలోనే స్పష్టం చేశారు. వెనిజులా తమ దేశంలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తోందని ట్రంప్‌ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. మదురోను లక్ష్యంగా చేసుకొని ఆయనను ఏకాకిని చేసేందుకు గత కొంతకాలంగా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. అయితే తన వద్ద ఉన్న అపారమైన చమురు నిల్వలను దోచుకోవడానికి అమెరికా కుట్ర పన్నుతోందని వెనిజులా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాను హంతకురాలిగా, దొంగగా, సముద్ర దొంగగా వెనిజులా ఆంతరంగిక శాఖ మంత్రి డయాస్‌డడో కాబెల్లో అభివర్ణించారు. ప్రపంచంలో అనేక యుద్ధాలను అమెరికా ఇలాగే మొదలు పెట్టిందని గుర్తు చేశారు. దేశాధ్యక్షుడు మదురో బుధవారం ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లకు సందేశాన్ని ఇచ్చారు. ‘వెనిజులాతో యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లకు నేనే ఓ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. బాగా పేరు తెచ్చుకున్న పాటను మీకు గుర్తు చేస్తున్నాను. బాధపడకండి… సంతోషంగా ఉండండి అనేదే ఆ పాట’ అని అన్నారు. ఇదిలావుండగా అమెరికా ఆంక్షలు విధించిన 30కి పైగా నౌకలు వెనిజులాలో వ్యాపారాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు వాటిని లక్ష్యంగా చేసుకొని అమెరికా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నదని విశ్లేషకులు హెచ్చరించారు.

పెరిగిన ధరలు
చమురు ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకున్నదన్న వార్తల నేపథ్యంలో సరఫరాలకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళన కారణంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు పెరిగిపోయాయి. అమెరికా చర్య సరకు రవాణాదారులను భయపెడుతోందని, వెనిజులా చమురు ఎగుమతులకు మరింత విఘాతం ఏర్పడే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -