పెరుగుతున్న ఉద్రిక్తతలు
కారకాస్ : అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వెనిజులాకు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలిలో చేపల వేట కు వెళ్లిన ఓ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం ఉద్రిక్తతలకు కారణమైంది. అమెరికా చర్యను వెనిజులా తీవ్రంగా ఖండిం చింది. వెనిజులా ఆర్థిక వ్యవహారాల మంత్రి త్వ శాఖ శనివారం ఒక ప్రకటన చేస్తూ తొమ్మి ది మంది మత్స్యకారులతో ప్రయాణిస్తున్న ఓడను అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్ జాసన్ దన్‌హమ్ (డీడీజీ-109) డిస్ట్రాయర్ అడ్డుకున్నదని ఆరోపించింది. ఓడలోని మత్స్యకారుల వల్ల ఎవరికీ ఎ లాంటి ప్రమాదం లేదని, వారంతా వినయపూర్వకంగా వ్యవహరించే వారేనని తెలిపింది. అమెరికా యుద్ధ నౌకలో 18 మంది సాయుధ ఏజెంట్లు ఉన్నారని, వారంతా తమ ఓడలోకి ఎక్కి దానిని స్వాధీనం చేసుకున్నారని చెప్పింది. ఎనిమిది గంటల పాటు తమ ఓడ అమెరికా అధీనంలో ఉన్నదని పేర్కొంది. మితిమీరిన సైనిక చర్యలకు పాల్పడడం ద్వారా అమెరికా నేరుగా తమను రెచ్చగొడుతోందని మండిపడింది. అమెరికా సైన్యం గత వారం కరేబియన్‌లో సైనిక దాడి జరిపింది. ఈ దాడిలో 11 మంది వెనిజులా వాసులు మరణించారు. మాదక ద్రవ్యాలు రవాణా చేస్తోందన్న ఆరోపణతో వెనిజులా పడవను నీటిలో ముంచేశారు. అయితే మాదక ద్రవ్యాల రవాణాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలను వెనిజులా తోసిపుచ్చింది. అమెరికా అధ్యక్ష భవనం మాత్రం ఈ దాడిని సమర్ధించుకుంది. ఇదిలావుండగా ఘర్షణలకు అవకాశమున్న 284 ప్రదేశాలలో రక్షణ దళాలను, పోలీసులను, పౌర మిలిషియాలను మోహరిస్తున్నట్లు వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రకటించారు. జలాల పరిరక్షణకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే సాయుధ పోరాటానికీ సిద్ధమేనని ఆయన తెలిపారు.