– మాదక ద్రవ్యాల నియంత్రణ పేరుతో బెదిరింపు
– చమురు నిల్వలపై కన్ను
– కరేబియన్ సముద్రంలో ఉద్రిక్తత
కరాకస్ : వెనుజులా సరిహద్దుల్లో అమెరికా తన సైన్యాన్ని మోహరించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోదించడానికి 3 యుద్ధనౌకలు, 2 వేల మెరైన్‌లతో సహా 4 వేల మంది సైనికులు, ఒక అణు జలాంతర్గామి, నిఘా విమానాలు వెనుజులాకి సమీపంలోని కరేబియన్ సముద్రంలో సిద్ధంగా ఉన్నాయని అమెరికా బెదిరించింది.. దీనికి ప్రతిస్పందనగా వెనిజులా 45 లక్షల సభ్యులున్న జన రక్షక దళాన్ని (బొలివేరియన్ నేషనల్ మిలీషియా) పూర్తి స్థాయిలో సన్నద్దం చేసింది..ఈ చర్యను వెనుజులా అధ్యక్షుడు నికోలాస్ మాదురో ఖండించారు. ఇది అసంబద్ధమైన బెదిరింపుగా పేర్కొన్నారు. తమ అంతర్గత భద్రత రీత్యా జాతీయ ప్రతిఘటన దళాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు..అయితే మాదురోకు మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే కార్డెల్ డి లాస్ సోల్స్‌తో సంబంధముందని అమెరికా ఆరోపించింది. ఈ నెల మొదటి వారంలో మదురోను పట్టిస్తే 5 మిలియన్ డాలర్లు (సుమారు 40 కోట్ల రూపాయలు) బహుమానాన్ని ఇస్తామని ప్రకటించింది..
”మత్తుమందు” ఆరోపణల్లో వాస్తవమెంత ?
అమెరికా ఆరోపణలకు విశ్వసనీయమైన రుజువులు లేవని అంతర్జాతీయ డేటా సూచిస్తోంది. అమెరికా డేటా సంస్థ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ( యుఎన్‌ఒడిసి ) ప్రకారం ప్రపంచంలో మత్తుమందు ఉత్పత్తి , వ్యాపారం కొలంబియా, పెరూ, ఈక్వడార్ దేశాల్లో అధికం.. వెనిజులాలో మత్తుమందు ఉత్పత్తి కేంద్రాలు లేవు. కొలంబియన్ మత్తుమందులో కేవలం 5% మాత్రమే వెనిజులా ద్వారా రవాణా అవుతుందని యుఎన్‌ఒడిసి నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా మాదక ద్రవ్యాలను వినియోగించేది, డిమాండ్ చేసేదీ అమెరికానే. సరఫరా చేసేది మాత్రం దక్షిణ అమెరికాలోని దాని మిత్రదేశాలని వెనుజులా వర్గాలు విమర్శిస్తున్నాయి.
అసలు కారణం ఏమిటి?
అమెరికా సైన్యం మోహరింపు మత్తుమందు నియంత్రణ కోసమే కాదు.. దీని వెనుక రెండు ప్రదాన కారణాలున్నాయి. వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్న దేశం. తన అనుకూల ప్రభుత్వాన్ని వెనుజులాలో అధికారంలోకి తీసుకొచ్చి, తద్వారా ఈ వనరులను కాజేయాలని అమెరికా చూస్తుంది.. వెనిజులాలోని మదురో ప్రభుత్వం అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడింది. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటించింది. ఈ నేపధ్యంలో రష్యా, చైనా వంటి అమెరికా ప్రత్యర్థులతో సంబంధాలు పెంచుకుంది. దీన్ని సహించలేకే అమెరికా తన సైన్యాన్ని మోహరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ అమెరికా సైన్యాన్ని మోహరించడాన్ని తీవ్రంగా నిరసించారు. ” దురాక్రమణకు వ్యతిరేకం. ఇది మా రాజ్యాంగంలోనే ఉంది” అని స్పష్టం చేశారు. అమెరికా చర్యలను నిరసిస్తూ వెనిజులాలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదరశనలు జరిగాయి. బ్రెజిల్, మెక్సికో, చిలి కమ్యూనిస్టు పార్టీలు అమెరికా చర్యను ఖండించాయి.ఈ ఉద్రిక్తలతో వెనుజులాతో ఆర్థిక, ఇంధన సంబంధాలున్న కరేబియన్ దేశాలు వాణిజ్యం, చమురు సరఫరాలకు అంతరాయం కలుగుతుందని, ఈ ప్రాంతంలో అస్తిరత ఏర్పడుతుందని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..
వెనిజులా సరిహద్దుల్లోఅమెరికా సైన్యం మోహరింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES