నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు ట్రంప్ మరింత దూకుడుగా టారిఫ్‌లను విధిస్తున్నారు. కాపర్ దిగుమతులపై 50శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్ 1 నుండి సెమీ -ఫినిష్డ్ కాపర్, కాపర్ ఆధారిత ఉత్పత్తుల దిగుమతులపై 50శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు బుధవారం విడుదలైన వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేర్కొంది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిస్థితుల్లో, పరిమాణంలో కాపర్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు ఈ ప్రకటన తెలిపింది.
భారత్ 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు 360 మిలియన్ డాలర్ల విలువైన రాగి ఉత్తత్తులను ఎగుమతి చేసింది. వాటిలో ప్లేట్లు, ట్యూబ్‌లు మరియు ఇతర సెమీ -ఫినిష్డ్ నమూనాలు ఉన్నాయి. ట్రంప్ టారిఫ్‌లతో ఈ ఎగుమతులు ఇప్పుడు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.
జపాన్ మరియు యూరోపియన్ యూనియన్ వంటి మిత్రదేశాలతో సహా అన్ని దేశాలకు టారిఫ్ ఒకే విధంగా వర్తిస్తోందని .. ఇది సరఫరా దేశాల్లో సమాన స్థాయిని సృష్టిస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్‌ఐ) పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్ దేశ కాపర్ వాణిజ్యంపై ప్రభావం పరిమితంగా ఉంటుందని జిటిఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజరు శ్రీవాస్తవ పేర్కొన్నారు.