Thursday, November 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆడిటింగ్‌కు ఏఐ టెక్నాలజీ వినియోగం

ఆడిటింగ్‌కు ఏఐ టెక్నాలజీ వినియోగం

- Advertisement -

– భారత కాగ్‌ సంజరుమూర్తి
– హైదరాబాద్‌లో ఫెనాన్షియల్‌ ఆడిట్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టం, విస్తృతం అవుతున్న కారణంగా ఆడిటింగ్‌కు కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) టెక్నాలజీని వినియోగిస్తామని భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ కె సంజరుమూర్తి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఫైనాన్షియల్‌ ఆడిట్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజరుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్‌ ఆడిటింగ్‌లో మేలైన మార్పుల్ని ప్రవేశపెట్టాలని సంకల్పించామని అన్నారు. దీనికోసం జ్ఞానాధారిత వేదికగా తోడ్పడే ఒక శ్రేష్టత కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశయాన్ని నెరవేర్చడానికి సీఓఈఎఫ్‌ఏను స్థాపించారని చెప్పారు. ఈ మార్పులను ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌ఈలు), స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు (ఏబీ)తోపాటు పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీ)ను దృష్టిలో పెట్టుకుని తీసుకురానున్నట్టు వివరించారు. ఆధునిక డిజిటల్‌ సాధనాల సాయంతో, ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులను అనుసరిస్తూ, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా సిబ్బందిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. దేశ, విదేశాల్లో ప్రభుత్వ రంగ ఆడిటింగ్‌ స్థాయిని పెంచడానికి భవిష్యత్‌ కాలానికి అనుగుణంగా అనుబంధ విస్తారిత వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అవసరాన్ని తీర్చాలని ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ వ్యయంలో జవాబుదారీతనానికీ, పారదర్శకతకూ పెద్ద పీట వేసేందుకు భారత సీ అండ్‌ ఏజీ మార్గదర్శకత్వంలో సీఏఈఎఫ్‌ఏ పరిశోధన, నవకల్పన, విధానపరమైన మద్దతులతోపాటు సామర్థ్యాల పెంపునకు ఒక కూడలి (హబ్‌)గా పనిచేయనుందని వివరించారు. ఆర్థిక నిర్వహణ తీరుతెన్నులు రోజురోజుకూ పెనుమార్పులకు లోనవుతున్న నేపథ్యంలో వాటిని అవగాహన చేసుకునేందుకు కావాల్సిన నైపుణ్యాలనూ, సాధనాలనూ, జ్ఞానాన్నీ సంపాదించుకోవడంలో ఆడిటర్లకూ, ఆడిట్‌ సంస్థలకూ, ఇతర ఆసక్తిదారులకూ సీఓఈఎఫ్‌ఏ అండగా నిలుస్తుందని అన్నారు. సిమ్లాలోని జాతీయ ఆడిట్‌, అకౌంట్ల అకాడమి మార్గదర్శకత్వంలో హైదరాబాద్‌లోని సీఓఈఎఫ్‌ఏ పనిచేస్తుందని చెప్పారు. ఎన్‌ఏఏఏకు చెందిన సీఓఈఎఫ్‌ఏ, భారత చార్టర్డ్‌ అకౌంటెంట్ల సంస్థ (ఐసీఏఐ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలపై ఐసీఏఐ వైస్‌ ప్రెసిడెంట్‌ సిఎ ప్రసన్న కుమార్‌, ఎన్‌ఏఏఏ డీజీ ఎస్‌ అలోక్‌ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీ అండ్‌ ఏజీ ఆనంద్‌ మోహన్‌ బజాజ్‌, జాతీయ ఆడిట్‌, అకౌంట్ల అకాడమి (ఎన్‌ఏఏఏ)లో అడిషనల్‌ డిప్యూటీ సీ అండ్‌ ఏజీ, డీజీ ఎస్‌ అలోక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -