టాప్ 10 రాష్ట్రాల జాబితా విడుదల చేసిన ఎన్సీఆర్బీ
ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలే అధికం
యూపీ ఫస్ట్..ఐదో స్థానంలో ఢిల్లీ..
న్యూఢిల్లీ : తలసరి నేరాల సంఖ్య ఆధారంగా, అత్యధిక నేరాల రేటు కలిగిన టాప్ 10 రాష్ట్రాల జాబితాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) -2024 ఆదివారం విడుదల చేసింది. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలే అధికంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అత్యధిక నేరాల రేటుతో యోగి పాలనలోని యూపీ మొదటి స్థానంలో ఉన్నది. ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నేర కార్యకలాపాల ధోరణులు, నమూనాలపై ఈ నివేదిక కీలకమైన సమాచారాన్ని అందిస్తోంది. తలసరి నేరాల రేటుపై దృష్టి సారించడం ద్వారా, జనాభా పరిమాణంతో సంబంధం లేకుండా రాష్ట్రాల మధ్య మరింత కచ్చితమైన పోలికను ఈ నివేదిక అందిస్తుంది. దొంగతనం, దోపిడీ నుంచి హింసాత్మక నేరాలు, మహిళలపై దాడుల వరకు, విస్తతమైన పరిధిలో ఉన్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నట్టు నివేదిక తెలిపింది. ఎన్సీఆర్బీ విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఆర్థిక మోసాలు, గహహింస, సైబర్ క్రైమ్‌లతో నేరాల రేటు గణనీయంగా పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది.
ఎన్సీఆర్బీ ప్రకారం.. 2024లో అత్యధిక తలసరి నేరాల రేటు కలిగిన 10 రాష్ట్రాల వివరణాత్మక పరిశీలన ఈ విధంగా ఉంది. అత్యధిక నేరాలు నమోదవుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎన్సీఆర్బీ -2024 విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో ఉంది. తలసరి నేరాల రేటు 7.4.గా నమోదైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దొంగతనం, హింసాత్మక నేరాలు మరియు మతహింస అధికంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఈశాన్యరాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్ నేరాల రేటు 5.8తో రెండవ స్థానంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ప్రయాణాలపై కొనసాగుతున్న ఆంక్షలు.. రాష్ట్రంలో భద్రతా సమస్యలను సూచిస్తున్నాయి. 5.3 రేటుతో మూడో స్థానంలో ఉన్న జార్ఖండ్‌లో హింస, అక్రమ మైనింగ్ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నేరాల రేటు 5.1గా కలిగి ఉన్న మేఘాలయ తరచుగా భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.
ముఖ్యంగా కొన్ని గిరిజన ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉన్నప్పటికీ.. నేరాల రేటు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. 5.0 రేటుతో ఢిల్లీ ఐదో స్థానంలో ఉన్నది. ఇక్కడ దాని జనాభాతో పోలిస్తే అధిక నేరాల రేటును నమోదు చేస్తూనే ఉంది. ముఖ్యంగా లింగ ఆధారిత హింస, దాడులు, దొంగతనాలు వంటి నేరాల సంఖ్య అధికంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. నేరాల రేటు 4.4తో అసోంలో ఆరో స్థానంలో ఉన్నది. ఇక్కడ రాజకీయ అస్థిరత, జాతి ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్న సమస్యలను హైలెట్ చేస్తోంది. భూవివాదాల నుంచి సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుబాటు సంబంధిత హింస వరకు నేరాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ 4.0 నేర రేటుతో తర్వాతి స్థానంలో ఉన్నది. ఈ రాష్ట్రం చాలా కాలంగా అంతర్గత భద్రతా సమస్యలతో పోరాడుతోంది. 3.8 నేరాల రేటుతో హర్యానా, ఒడిశాలు వరుసగా 8, 9 స్థానాల్లో నిలవగా, 3.6 నేరాల రేటుతో ఏపీ పదో స్థానంలో నిలిచింది.



