కుంభవృష్టితో మెరుపు వరదలు
ఎనిమిది మంది మృతి – 20 మంది పైగా గల్లంతు
భారీగా ఆస్తినష్టం..స్తంభించిన రాకపోకలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో కకావికల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 15న సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు పలుమార్లు కుంభవృష్టి సంభవించడంతో మెరుపు వరదలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రధానంగా డెహ్రాడున్, రారుపుర్, రిషికేశ్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలతో పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మట్టిచరియలు, కొండ చరియలు విరిగిపడటంతో రహదారులు ధ్వంసమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయాయి. ఈ ఘటనల్లో 500 మంది వరకు వరద నీటిలో చిక్కుకోగా..సహాయక బృందాలు రక్షించాయి.
అయితే వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది చనిపోయారని, మరో 20 మంది గల్లంతయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. డెహ్రాడున్‌లోని పవుంధా ప్రాంతంలో దేవ్‌భూమి ఇనిస్టిట్యూట్ వరద నీటిలో చిక్కుకుపోవడంతో అందులోని 200 మంది విద్యార్థులను రాష్ట్ర విపత్తు నివారణ బలగాలు (ఎస్‌డీఆర్‌ఎఫ్) రక్షించాయి. రిషికేశ్‌లోని చంద్రభాగ నది ఉప్పొంగి ప్రవహించడంతో హైవే పైకి నీరు చేరింది. భారీ వాహనాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద బాధిత ప్రాంతాలను మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరిశీలించారు. పెను విపత్తు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోనూ..
హిమాచల్ ప్రదేశ్‌లోనూ మంగళవారం భారీ వర్షాలు కురిసాయి. జనజీవనం అస్తవ్యస్తమయింది. మండి జిల్లాలోని సుందర్‌నగర్ సబ్‌డివిజన్‌లో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. వర్షాల కారణంగా ఇదే జిల్లాలోని ధరంపూర్‌లో బస్టాండ్ ఆకస్మిక వరదల్లో చిక్కుకుంది. దీంతో దుకాణాలు, 20కి పైగా బస్సులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా మూడు జాతీయ రహదారులతో సహా 650 రోడ్లును మూసివేశారు. మంచి నీటి పథకాలు, విద్యుత్ సరఫరాకు అంత రాయం కలిగింది. రాబోయే 24 గంటల పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ విభాగం పేర్కొంది.