హైదరాబాద్, పుదుచ్చేరి మ్యాచ్ డ్రా
పుదుచ్చేరి : రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. పుదుచ్చేరిపై విజయం ముంగిట నిలిచిన హైదరాబాద్.. రెండు రోజుల పాటు వరుణుడి అంతరాయంతో డ్రాతో సరిపెట్టుకుంది. తనరు త్యాగరాజన్ (4/48), బి. పున్నయ్య (3/20) రాణించటంతో పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 45.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 435 పరుగుల భారీ స్కోరు చేసింది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 309 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఫాలోఆన్‌లో పుదుచ్చేరి 42 ఓవర్లలో 97 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. అనికెత్ రెడ్డి (2/25), తనయ్ త్యాగరాజన్ (2/32) రాణించారు. చివరి రోజు ఆట ముగిసేసరికి మ్యాచ్ ఫలితం తేలలేదు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో హైదరాబాద్ 3 పాయింట్లు సాధించగా, పుదుచ్చేరికి ఓ పాయింట్ దక్కింది. సెంచరీ బాదిన హైదరాబాద్ కెప్టెన్ రాహుల్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.



