Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేరళలో కూరగాయ పంటల సాగు భేష్‌

కేరళలో కూరగాయ పంటల సాగు భేష్‌

- Advertisement -

– ఉద్యానవన పంటల సాగు పాలసీ బాగుంది
– దళారీ వ్యవస్థ లేకుండా రైతులే మార్కెట్‌లో అమ్ముకునే విధానం
– తెలంగాణలోనూ ఉద్యాన పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నాం : రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేరళ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు కోసం తీసుకొచ్చిన పాలసీ బాగుందనీ, అక్కడ కూరగాయ పంటల సాగు భేష్‌ అని తెలంగాణ రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి కొనియాడారు. కౌలు రైతుల విషయంలో సైతం కేరళ సర్కారు అమలు చేస్తున్న విధానం ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. కేరళలో అమలవుతున్న విధానాలను తెలంగాణలో అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైతం కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి చేస్తున్న కృషిని వివరించారు. తెలంగాణ రైతు కమిషన్‌ బృంద సభ్యులు శుక్రవారం కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌ జిల్లాలో గల వడవన్నూర్‌, ఎలెవంచెరి గ్రామాల్లో సాగవుతున్న కూరగాయల తోటలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో రైతులు, కౌలు రైతులతో నేరుగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అక్కడ అమలవుతున్న సహకార వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. వడవన్నూర్‌, ఎలెవంచెరి గ్రామాల పరిధిలో కొనసాగుతున్న విజిటేబుల్స్‌ అండ్‌ ఫ్రూయిట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ కేరళం(వీఎఫ్‌పీసీకే-ఎస్‌కేఎస్‌) యూనిట్లను సందర్శించారు. కూరగాయల పంటల సాగు విధానం, మార్కెట్‌ ధర, రైతుల లావాదేవీల వంటి అంశాల గురించి కేరళ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కమిషన్‌ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వ్యవసాయ అనుభవాల పరస్పర మార్పిడి, రైతులకు ఉపయోగపడే సాంకేతిక పద్ధతుల అధ్యయనం, రైతు సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్టు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డితో పాటు సభ్యులు కేవీఎన్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్‌, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, ఉద్యనవన శాఖ అధికారి సురేష్‌, వ్యవసాయ శాఖ అధికారులు హరివెంటక ప్రసాద్‌, శ్రావణి వున్నారు.

ఎలెవంచెరి ప్రత్యేకత ఏమిటంటే
పాలక్కాడ్‌ జిల్లా నేన్మారా బ్లాక్‌ పరిధిలో ఎలెవంచెరి గ్రామం ఉంది. కూరగాయల ఉత్పత్తి ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆ గ్రామంలో 210 మంది రైతులు కలిసి 300 హెక్టార్లలో బీరకాయ, అలసందలు, గుమ్మడికాయ, బెండకాయ, పావక, కుంబలంగ, పడవలంగ తదితర కూరగాయల పంటలను సమూహంగా సాగు చేస్తున్నారు. 2024-25లో 4,500 మెట్రిక్‌ టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేసి రూ.16.74 కోట్ల అమ్మకాలు చేపట్టారు. ఓపెన్‌ ఫీల్డ్‌ ప్రెసిషన్‌ ఫార్మింగ్‌, పండల్‌ విధానం, ప్లాస్టిక్‌ మల్చింగ్‌, ఫర్టిగేషన్‌, నాణ్యమైన హైబ్రిడ్‌ విత్తనాల వినియోగం, నేల పరీక్ష ఆధారిత ఎరువు నిర్వహణ వంటి ఆధునిక పద్ధతులను ఆ గ్రామ రైతులు అనుసరిస్తున్నారు. కృష్ణి భవన్‌-ఎలెవంచెరి పరిధిలోని 5 కూరగాయల క్లస్టర్లు, వీఎఫ్‌పీసీకే ఆధ్వర్యంలోని 15 స్వయం సహాయ సంఘాలు కలిసి విత్తనం నుంచి మార్కెటింగ్‌ వరకు ప్రతి దశను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి. తీసిన పంటను వీఎఫ్‌పీసీకే నెట్‌వర్క్‌కు చెందిన గ్రూపులు కొనుగోలు చేసి రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులు చేస్తాయి. ఈ పారదర్శక వ్యవస్థ రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తోంది. వీఎఫ్‌పీసీకే అనేది కేరళ ప్రభుత్వం(30 శాతం), రైతులు(50 శాతం), ఆర్థిక సంస్థల భాగస్వామ్యం(20శాతం)తో ఏర్పాటైన ప్రత్యేక సంస్థ. వాణిజ్యపరమైన కూరగాయలు-పండ్ల సాగును ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. విత్తన ఉత్పత్తి, నాణ్యమైన నాట్ల తయారీ, శిక్షణల ఏర్పాటు, పంట రుణాలు, పంట బీమా, గ్రూప్‌ మార్కెటింగ్‌ వంటి విస్తృత సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 296 రైతు మార్కెట్లను ఆ సంస్థ నిర్వహిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -