Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeమానవిస్పూర్తి ప్ర‌దాత వెంక‌ట‌మ్మ‌

స్పూర్తి ప్ర‌దాత వెంక‌ట‌మ్మ‌

- Advertisement -

కాస్త కష్టం వచ్చినా కుంగిపోవడం, చిన్న బాధ కలిగినా భరించలేకపోవడం నేటి తరానికి ఓ అలవాటుగా మారిపోయింది. వెంకటమ్మ మాత్రం ఎన్ని కష్టాలు వచ్చిన జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకుంది. భర్త తాగి ఇల్లు పట్టక తిరుగుతుంటే నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. 65 ఏండ్లు దాటినా ఇప్పటికీ తన కష్టాన్నే నమ్ముకొని బతుకుతున్న ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం.
వెంకటమ్మ మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని బల్సర్‌ కొండ అనే పల్లెలో పుట్టింది. అమ్మానాన్నల ఐదుగురు సంతానంలో వెంకటమ్మ రెండవది. కేవలం ఐదేండ్ల పసి ప్రాయంలోనే పదకొండేండ్ల బంధువులబ్బాయితో పెండ్లి చేశారు. అత్యంత చిన్న వయసులోనే నలుగురు పిల్లలకు తల్లి అయ్యింది. ఇంట్లో బండెడు చాకిరీతో అలసిపోయేది. దోరపల్లి అత్త వారింట కాలు పెట్టిన ఆమె పొలంలో కూలీగా నడుంవంచింది. భర్త ఇస్త్రీ చేసేవాడు.
కూలీ పనులతో పాటు…
వెంకటమ్మ కూలీ పనులు చేస్తూనే గ్రామపెద్దల ఇంటి నుంచి రోజూ రెండు మూటల బట్టలు మోసుకుని చెరువు దగ్గరకు వెళ్ళేది. అక్కడ తెల్ల ఉప్పులాగా మెరిసే చవుడుని బట్టలకి పట్టించి తెల్ల బట్టలు కుండలో వేసి నీళ్లు ఉడికించేది. రంగు బట్టలు విడిగా ఉతికేది. ఆరోజులలో సుబ్బు వాడేవారు కాదు. ఆపై చెరువు ఒడ్డున గడ్డిపై ఆరేసేది. అవి ఎండిపోగానే ఇంటికి తెస్తే భర్త ఇస్త్రీ చేసేవాడు. ఇంత చాకిరి చేసినందుకు ఆరునెలలకోసారి ఓ బస్తా జొన్నలో, బియ్యమో ఇచ్చేవారు. పొలంలో దొరికే కూరలతో సంసారాన్ని నడిపించేది. తను తిన్నా తినకపోయినా పిల్లలని మాత్రం బడికి పంపేది. భర్త తాగుబోతు . తాగొచ్చి విపరీతంగా కొట్టేవాడు. ఆ బాధలు భరించలేక పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. భర్తను వదిలేసి వచ్చిందని అంతా ముక్కుమూతి విరిచి సూటిపోటి మాటలనేవారు.
పిల్లల్ని చదువుకోసం
డ్రైవర్‌గా పని చేసే తమ్ముడు వెంకటమ్మను, ఆమె పిల్లలని మహబూబ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పనికి పెట్టాడు. అక్కడ ఐదేండ్లకు పైగా పనిచేసి పిల్లలని పదో తరగతి వరకు చదివించింది. వారి చదువుల కోసమే ఆమె ఇంతగా కష్టపడింది. ఆమె తన పల్లెలో రాళ్ల గోడల గుడిసెలో ఉండేది. ఇప్పటికి ఆమె భర్త చనిపోయి 26 ఏండ్లు అవుతుంది. తన కష్టంతోనే పిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది. మేనత్త హైదరాబాద్‌లో ఉండటంతో వెంకటమ్మ కూడా ఇక్కడే వచ్చి సెటిలైంది. ప్రస్తుతం ఆమె గుళ్లలో పనులు చేసుకుంటూ బతుకుతుంది.
మనకు ఉన్నదాంట్లోనే…
18 ఏళ్లుగా వెంకటమ్మ పోచమ్మ గుడిలో, 10 ఏండ్ల నుంచి భరత్‌ నగర్‌ సాయిబాబా గుడిలో ప్రసాదాలు తయారు చేసే పాత్రలు కడుగుతూ, గుడి శుభ్రంచేస్తూ గడుపుతోంది. రెండో కూతురు మనవడితో ఉంటూ పిల్లాడిని చదివిస్తోంది. ఇక కాలనీలోని వారి ఇళ్లకు వెళ్లి పసిపాపలకు చక్కగా స్నానం చేయిస్తుంది. గుడికి వచ్చేవారితో ఆప్యాయంగా మాట్లాడుతుంది. అంత పేదరికంలోనూ మనకున్న దానిలో కొంతైనా దానం చేయాలని నమ్మే వ్యక్తిత్వం ఆమెది. ఎన్ని అవసరాలున్నా ఎవరి నుంచీ ఏమీ ఆశించదు. తన సొంత సంపాదనతో ఇటీవలె కాళ్లకు వెండికడియాలు చేయించుకుంది. ఇలాంటి మహిళలు నేటి తరానికి నిజమైన స్ఫూర్తి ప్రదాతలు.
– అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img