మనిషైపుట్టిన ప్రతివాడూ కనీసం ఇతర మనుషులకు మాటసాయం అయినా చెయ్యాలి అనే విషయాన్ని గాఢంగా, దృఢంగా, నిలువెత్తు లోతుగా నమ్మినవాడు సర్వేశ్వరుడు. సర్వశ్వరుడనగానే పైపైకి ఎక్కడికో వెళ్లకండి, సర్వేశ్వర్రావన్నమాట. మనుషులన్నాక సమస్యలు అనేకం వుంటాయి. అయితే సమస్యలకు పరిష్కారాలనేవి లేకుండా వుండవు. సాయం అనేక రకాలు వుండవచ్చు కానీ ‘మూటసాయం’ ఎంత గొప్పదో ‘మాట సాయం కూడా అంతే గొప్పది. ఒక్కోసారి అంతకుమించి అని కూడా సర్వేశ్వర్రావు నమ్మకం. ఊహ తెలిసిన్నాటినుంచి ఈ పరోపకారం మొదలుపెట్టేడు సర్వశ్వర్రావు. కాకపోతే ఊహ తెలియడానికి కొంచెం ఆలస్యం అయిందంతే. ఎప్పుడయితే తను అడగని వారిక్కూడా సలహాలివ్వడం అనే మాట సాయం మొదలు పెట్టాడో, అప్పట్నించి అడిగేవారు అడగడం మొదలుపెట్టారు. జేబులో చేయి వేసేది లేదు, పనికి ఓ చేయి సాయం చేసేది లేదు. ఏ సమస్యకైనా బుర్రలోకి తొంగిచూసి అడుగంటా కెలికి చూసి ఏదో ఓ సలహా ఇచ్చేయడానికేం భాగ్యం, ఒళ్లు అలవకుండా అనుకునేవాడు సర్వశ్వర్రావు. సలహా అంటే ఏమిటి ఊక దంపుడే కదా, ఉత్తి ముచ్చట్లే కదా అని ఎవరయినా తెగిడితే దానికి జవాబు రెడీగా వుండేది సర్వేశ్వరుడి దగ్గర. మహాభారతంలో శ్రీ కృష్ణుడు ఆయుధం పట్టాడా? యుద్ధం చేశాడా? లేదే! ఏదో సరదాగా రథం డ్రైవ్ చేస్తూ తోచిన మాట సాయం చేశాడంతే. మాట సాయంతోనే కదా యుద్ధం గెలిపించాడు అని వాదించేవాడు.
ఉద్యోగ పర్వంలో ఆఫీసులో సాటి ఉద్యోగులందరికీ కిలోల లెక్కన, క్వింటాళ్ల లెక్కన అనేక రకాలమాట సాయం చేశాడు ఒక్క పై ఆఫీసర్‌కి తప్ప. ఆయన మూర్ఖుడు కనుక. మూర్ఖులకు సర్వేశ్వర్రావు మాటసాయం చెయ్యవద్దని ఒట్టు పెట్టుకున్నాడు కనక. ఆఫీసును పక్కన పెడితే, ఇంటి చుట్టుపక్కల వుండే వారిని వదిలాడా అంటే వదుల్తాడా, సాయం చెయ్యడం అలవాటయినవాడు కదా! కనపడ్డ వారివీ, కనపడనివారివీ సమస్యలు అడిగి తెల్సుకుని, వెళ్లి వెంటపడి సలహాలు ఇచ్చేవాడు. ఒకటి కాకపోతే మరొకటి వాడుకోవచ్చునని ‘ఛాయిస్’ కూడా ప్రసాదించేవాడు. అడిగినా అడకపోయినా, అవసరం అయినా కాకపోయినా ఇలాగ ఉచిత సలహాలు ఇవ్వడం అవసరమా అని పత్నిసుతులు సర్వేశ్వర్రావు మాటసాయానికి ఆనకట్ట కట్టాలని ప్రయత్నించి ఫెయిలయిపోయారు. అన్ని దానాల కన్నా అన్నదానం కన్నా మాటసాయం మిన్న. ఈమాత్రం పుణ్యం సంపాదించుకోకపోతే జన్మ సార్థకం కాదు అని వాళ్లను దబాయించేవాడు. ఇది చెయ్యి, అది చెయ్యి, అలా చెయ్యి ఇలా చెయ్యి అని సలహాలు ఇచ్చేవాడు లేకపోతే లోకమే వుండదు. ప్రభుత్వాలు కూడా సలహాదార్లని నియమించుకుంటరని మీకు తెలీదా అని కోప్పడేవాడు.
నీ సేవలూ సలహాలూ ఇంక చాలు అంటూ ప్రభుత్వం ఉద్యోగం నుంచి రిటైర్ చేసింది. ఉద్యోగానికి రిటైర్‌మెంటు వుంటుందికాని సలహాలకూ, సాయానికీ రిటైర్‌మెంట్ అనేది వుండదు కదా! అందువల్ల ఇంటిముందరి గదిలో బల్ల వెనుక కూచుని వచ్చేపోయేవారిని పిలిచి మరీ మాటసాయం అందించడం ఆరంభించాడు సర్వేశ్వర్రావు. ఇక్కడ ఎవరో ఉచిత సలహాలు ఇస్తారట అని ఎవరైనా వీధిలో వాకబు చేస్తే, సర్వేశ్వర్రావు ఇంటిని చూపించేవారు జనం. ఇంటిపక్కనే వున్న సత్యన్నారాయణ తననే సర్వేశ్వర్రావనుకుని కొందరు సలహా కోసం పొరపాటున తన ఇంట్లోకి జొరబడుతుండడంతో విసుగెత్తి, సర్వేశ్వర్రావు ఇంటి గోడమీద తన స్వంత ఖర్చుతో ‘ఇచ్చట ఉచిత సలహాలు ఇవ్వబడును’ అని రాయించాడు. ఉచితం అంటే ఎవరికైనా ప్రియమైన విషయమే కదా! జనం అడ్రసు కోసం ఎవరినీ దేబిరించకుండా, సరాసరి సర్వేశ్వర్రావు దర్శనానికి వచ్చేయడం మొదలు పెట్టారు. కొందరి సమస్యలకు జ్యోతిష్యశాస్త్రం పరిజ్ఞానం అవసరమని ఆ రంగంలో కూడా వేలు పెట్టి, మాట సాయం చేసే ప్రతిభని మరింత పెంచుకున్నాడు సర్వేశ్వర్రావు. చిత్ర విచిత్రమైనవి, జటిలమైనవి, కఠినమైనవి అనేక సమస్యలు మనుషుల్ని పట్టి పీడిస్తుంటాయి. కొన్ని కొన్ని సమస్యలకు తన బుర్రలో సరుకు సరిపోకపోతే గ్రహాలలోకంలో కూడా సంచరించేవాడు సర్వేశ్వరుడు.
ఒకనాడు ఓ బక్కపలచటి మనిషి హడావిడిగా సర్వేశ్వర్రావును వెదుక్కుంటూ వచ్చాడు. నూనె లేక ఎండిపోయిన జుట్టు, చెమటకారే ముఖమూ వున్న ఆ మనిషికి తన మాటసాయం ఎంతో అవసరం అనుకుని ఆసక్తిగా అతని సమస్య ఏమిటని అడిగాడు. అయ్యా! తమరు సర్వేశ్వరులు ఎందుకు? ఏమిటి? అని అడగకండి. నేనిప్పుడు వున్న పరిస్థితిలో చావు తప్ప మరొక మార్గం లేదు. చచ్చి ఏమి సాధిస్తావు? ఎవరిని సాధిస్తావు? అనవద్దు. చావడానికి మార్గం మాత్రం చెప్పండి. ఎలా చావాలో మాట సాయం చెయ్యండి అంతే అన్నాడు ఆ అపరిచితుడు. ఉలిక్కిపడ్డాడు సర్వేశ్వరుడు. ఇదేమి సమస్య? దీనికేమి పరిష్కారం? అయినా చావడానికిక్కూడా సలహానా చోద్యం కాకపోతే! ఎన్ని మార్గాలు లేవు? రైలు పట్టాల మీద నిద్రపోవచ్చు. సిటీ బస్సుకు ఎదురేగవచ్చు. ఫ్యాన్‌కి వేలాడి నాలుక బైట పెట్టవచ్చు. పాయసంలోనో, సాంబారులోనో పాయిజన్ కలపవచ్చు లేదా మేడమీది నుంచి దూకి అరిచే పనిలేకుండా నేలను కరుచుకోవచ్చు అనుకున్న సర్వేశ్వర్రావు ఆ మాటే అడిగాడు. అప్పుడా మనిషి అవేవీ చెయ్యలేనని, అంత ధైర్యం తనకు లేనేలేదని, సునాయాసంగా, చస్తున్నానని తెలీకుండా తేలిగ్గా చచ్చేమార్గం సూచించమని బతిమాలాడు.
అప్పుడు తన బుర్రలో ఓ మూల దాక్కున్న సలహాని జుట్టుపట్టుకుని బయటకి ఈడ్చుకువచ్చాడు సర్వేశ్వర్రావు. నువ్వింతగా అడుగుతున్నావు కనక, పట్టుపడుతున్నావు కనుక నీకే తెలీకుండా తేలిగ్గా, అరిచేపని లేకుండా, అయ్యో చచ్చిపోతున్నానే అనే దిగులు లేకుండా చచ్చేమార్గం చెప్తా విను అని ఇలాగ మాట సాయం చేశాడు. ”నీ చేతికి మట్టి అంటకుండా, నువ్వు చెయ్యి చేసుకోకుండా చావాలని అనుకుంటే ఏదయినా రాజకీయ పార్టీ నిర్వహించే ‘ర్యాలీ’కి గానీ రోడ్డుషోకి గానీ వెళ్లు. కాగల కార్యం గంధర్వులే చేస్తారన్నట్టు వేలం వెర్రిగా, విచ్చలవిడిగా, అభిమానంగా, దురభిమానంగా వచ్చే జనం తొక్కి చంపేస్తారు. నిన్ను కింద పడేసి ఓ యాభయ్యో, వందమందో ఎక్కి నడిచిపోతే చస్తున్నానని తెలీకుండా చివరి కేక కూడా వెయ్యకుండా వెళ్లిపోతావు. ఆ తర్వాత ఆ పార్టీవాళ్లు, ప్రభుత్వంవారు పరిహారం కింద అంతో ఇంతో సొమ్ము నీ కుటుంబానికి అందజేస్తారు. అది నీకు అదనపు లాభం, ‘చావు బోనస్’ అవుతుంది.
చింతపట్ల సుదర్శన్
9299809212