నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 10గంటల నుంచి ఆరు గంటలకు వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్‌లో భాగంగా తొలి ఓటు పీఎం మోడీ వేశారు. ఆ తర్వాత అధికార, ప్రతిపక్షాల ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార ఎన్డీయో కూటమి తరుపున ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బరిలో ఉండగా..ఇండియా బ్లాక్ కూటమి తరుపున తెలంగాణ వాసి బీ. సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఏడాది వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే జగదీశ్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
అదే విధంగా ఆప్, ఆర్జేడీకి చెందిన ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఇండియా కూటమి అభ్యర్థికి ఆప్, ఆర్జేడీ మద్దతు తెలిపినప్పటికీ..ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్, అలాగే ఆర్జేడీ ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్ ఎన్డీయే కూటమి అభ్యర్థికి ఓటు వేశారు. ఇక బీఆర్ఎస్, బీజేడీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. అలాగే పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ (SAD) కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలావుండగా లోక్‌సభలో 543 మంది ఎంపీలు ఉండగా.. రాజ్యసభలో 233 మంది సభ్యులు ఉన్నారు. ఇక 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉండగా.. 5 రాజ్యసభ, 1 లోక్‌సభ స్థానం ఖాళీగా ఉంది. మొత్తం 781 మంది ఎంపీలు ఓటులో పాల్గొననున్నారు. మ్యాజిక్ ఫిగర్ 391 మార్క్‌ను సాధిస్తే వారే ఉపరాష్ట్రపతి గెలువనున్నారు.