నవతెలంగాణ-హైదరాబాద్ : అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కింగ్‌డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. శనివారం తిరుపతిలో ట్రైలర్ లాంఛ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్‌గా సాగిన ఈ ట్రైలర్ అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ పాత విజయ్‌ని కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అంతకుముందు జరిగిన ఈ ట్రైలర్ లాంఛ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రాయలసీమ యాసలో అదరగొట్టాడు.
తిరుపతీ… ఎట్లా ఉండారు అందరూ?.. బాగుండారా?.. బాగుండాలి అందరం బాగుండాలి. ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము.. మీ అందరిని కలిసినాము. మీ అరుపులు కేకలు వింటుంటే చాలా సంతోషంగా ఉందబ్బా. మీ అందరికి ఒక మాట చెప్పాలే. ‘ఏడాది నుంచి ‘కింగ్డమ్’ గురించి ఆలోచిస్తుంటే ఒకటే అనిపిస్తాంది. మన తిరుపతి ఏడు కొండల వెంకన్న స్వామిగానీ.. ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. చాలా పెద్దొన్నై పూడుస్తా సామీ.. పోయి టాప్‌లో కూర్చుంటా. ఈ సినిమా కోసం అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ఇక మిగిలింది వెంకన్నస్వామి దయ, మీ అందరి ఆశీస్సులు. ఈ రెండూ గనుక ఉంటే మనల్ని ఎవరూ ఆపేదేలే. అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.