గ్రామాల్లో ఊపందుకున్న రాజకీయ వేడి
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మండలంలో గ్రామ సర్పంచుల పీఠం కోసం ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మూడో విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం బుధవారం నుంచి శుక్రవారం వరకు జరగనుంది. దీంతో 17న మండలంలో ఎన్నికలు జరగనున్నాయి.ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకులు ఈ ఎన్నికల్లో గెలు పొందడానికి పావులు కదుపుతున్నారు.
గెలుపు కోసం వ్యూహాలు..
ఒక్కో గ్రామంలో సర్పంచ్ పీఠం కోసం ప్రతి పార్టీ నుంచి ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ తీవ్రమవుతున్న దృష్ట్యా ఆయా గ్రామాల్లోని ఆశావహులు అగ్రనా యకుల మద్దతు కోసం వారి చుట్టూ తిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంత కార్యకర్తలు రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే సర్పంచ్ పదవే అత్యంత కీలకం. అధికారం వస్తే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల అగ్ర నేతలు, అధికారులతో పరిచయం ఏర్పడి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి సులువవుతుందని ఆలోచిస్తున్నారు. భవిష్యత్లో మరిన్ని రాజకీయ పదవులు చేపట్టడానికి సర్పంచ్ పదవితోనే గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతో పోరుకు సిద్దమవుతున్నారు.ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అంతర్గత ప్రచారం..
సర్పంచ్ పీఠం కోసం పోటీపడుతున్న ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో అంతర్గత ప్రచారం ప్రారంభించారు. బరిలో నిలిచే అభ్యర్థులు కులాల వారీగా ఓటర్లను బేరీజు వేసుకుంటూ యువజన సంఘాలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని ఎవరికి వారు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.ఉప సర్పంచ్ అవకాశం ఉంటుండంతో ఆయా గ్రామాల్లో వార్డు సభ్యుల కోసం చాలా మంది తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒక్కో వార్డు స్థానానికి దాదాపు 4 నుంచి 6మంది పోటీ పడుతున్నారు.



